
ప్రతీకాత్మక చిత్రం
విశాఖపట్నం, నక్కపల్లి(పాయకరావుపేట): అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ వేరొక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు ఆమెను ఇంటికి తీసుకురావడమే కాకుండా తనపై దాడి చేయించడాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లిలో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కొప్పిశెట్టి చినరాజుకు డొంకాడకు చెందిన నాగ వరలక్ష్మి(28)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. చినరాజు వేరొక యువతితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వరలక్ష్మి అతన్ని తరచూ నిలదీస్తూండేది.
వరలక్ష్మి మృతదేహం
దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇవి పెద్ద మనుషులు, కుటుంబ పెద్దలు వరకు వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయితే వివా హేతర సంబంధం పెట్టుకున్న యువతిని రాజు శనివారం తన ఇంటికి తీసుకు వచ్చాడు. దీంతో వరలక్ష్మికి ఆ యువతికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదం ముదరడంతో వరలక్ష్మి ఇంటికి వచ్చిన యువతి అదే ఇంటి మేడ పైనుంచి కిందకు దూకింది. ఆమెకు గాయాలయ్యాయి. దీంతో భర్త రాజు వరలక్ష్మిని మందలించాడు. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈవిషయాన్ని చుట్టుపక్కల వారు, బంధువులు కొత్తూరులో ఉంటున్న సోదరికి సమాచారం ఇచ్చారు. భర్త, అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి వేధింపుల కారణంగానే వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment