ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా.. | Husband Assassinated Pregnant Wife in Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మ కోసం.. వరకట్న వేధింపులకు బాలింత బలి

Published Mon, Jun 1 2020 9:05 AM | Last Updated on Mon, Jun 1 2020 9:56 AM

Husband Assassinated Pregnant Wife in Hyderabad - Sakshi

కడుపు నిండా పాలుతాగి.. హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి.. డబ్బా పాలు తాగుతున్నాడు.. ఒడిలోకి తీసుకొని పాలు తాగించే చుట్టుపక్కల వారినే అమ్మ అనుకుంటున్నాడు. పాలు తాగుతూ.. మధ్యమధ్యలో బోసినవ్వులు చిందిస్తున్నాడు. పాలు పట్టిస్తుంటే.. వారిని తీక్షణంగా చూస్తున్నాడు.. అందర్లోనూ అమ్మనే చూస్తున్నాడు. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని పెంచే కన్నతల్లి మాత్రం లోకం విడిచిపోయిందని 46 రోజుల ఆ చిన్నారికి తెలియదు. 

జూబ్లీహిల్స్‌:  బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో భార్యనే హత్య చేసి భర్త పరారైన ఘటన కలకలం సృష్టించింది. అనిల్‌– అనిత భార్యాభర్తలు. కొన్నేళ్లుగా ఇందిరానగర్‌లోనే నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అక్షిత(7), ఆర్య(3), అంకిత(రెండున్నరేళ్లు), చివరగా బాబు 46 రోజుల పసికందు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం రాత్రి గొడవ జరగడంతో భర్త అనిల్‌ భార్య అనితను తీవ్రంగా కొట్టాడు. వద్దు నాన్నా.. అమ్మను కొట్టొదంటూ చిన్నారులు వేడుకున్నారు. అయినా తండ్రి కనికరించలేదు. ఏడ్చి ఏడ్చి చిన్నారులు నిద్రపోయారు. కొంత సమయం తర్వాత మళ్లీ విచక్షణారహితంగా కొట్టడంతో అనిత అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో అనిల్‌ పరారయ్యాడు. ఉదయం నిద్ర లేచిన చిన్నారులు తల్లి మృతదేహం వద్ద గుక్కపెట్టి ఏడుస్తుండటంతో స్థానికులు వారికి భోజనం అందించారు. 46 రోజుల చిన్నారికి పాలు పట్టారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరారవ్వడంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... నలుగురు పిల్లలను కన్నాడు... తనకు మంచి వ్యాపారం కూడా ఉంది. అయినా అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను గొడ్డును బాదినట్టు బాది దారుణంగా హత్య చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉండే రుడావత్‌ అనిల్‌(31) సినిమా వారికి సెట్టింగ్‌లకు స్టేజీలు, డెకరేషన్‌ వస్తువులను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వికారాబాద్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలం గోకాసకల్‌వాడ పక్కనే ఉండే గొడమర్రిగడ్డ›తండా చెందిన అనితను 2009లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగింది. మరుసటి ఏడాది నుంచి అనితను కట్నం తీసుకురావాల్సిందిగా నిత్యం వేధించేవాడు. అనుమానంతో ఆమెను దారుణంగా కొట్టేవాడు.(పగబట్టిన ప్రేమ; సాఫ్ట్‌వేర్‌ యువతికి..! )

పలుమార్లు పెద్ద మనుషుల పంచాయితీల్లో కూడా అనిల్‌ను మందలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం అనిత అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరోసా కేంద్రంలో కూడా అనిల్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని అనిల్‌ నిత్యం భార్యను వేధించేవాడు. తప్పతాగి వచ్చి నిత్యం కొట్టేవాడు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి చిన్న కుమారుడి వయసు 45 రోజులు. అయితే శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన అనిల్‌ భార్యపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇంట్లో వేడి నీళ్లు పెట్టేందుకు వినియోగించే కరెంటు హీటర్‌తో అనితను తీవ్రంగా కొట్టాడు. చప్పుడు విని లేచిన అనిత పెద్ద కూతురు అక్షిత లేచి నాన్న అమ్మను కొట్టొద్దు అని వేడుకున్నప్పటికీ అనిల్‌ కనికరించకుండా దాడి చేయడంతో అనిత అక్కడికక్కడే మృతి చెందింది. అనిత మృతి చెందింది అని తెలుసుకున్న అనిల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. చనిపోయిన అనిత బాలింత కావడంతో జరిగిన ఘటనతో ఇందిరానగర్‌ బస్తీ ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు తెల్లవారుజామున అక్కడికి చేరుకొని ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అనిత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు మోహన్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement