ఇటీవల యువతి హత్య జరిగిన రిసార్టు, (ఇన్‌సెట్లో) మృతురాలు శిరీష (ఫైల్)
శంకర్‌పల్లి : నగర శివారుకు ఆనుకొని ఉన్న మన జిల్లాలో రిసార్టులు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. నిత్యం పని ఒత్తిడికి లోనయ్యే వారు వారాంతాల్లో ఇక్కడ సేద తీరేందుకు వస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం నిర్వాహకులు కుటుంబాలతో వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. కాగా, లాభార్జనే ధ్యేయంగా రిసార్టుల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా యువతీయువకులకు సైతం గదులను అద్దెకు ఇస్తున్నారు. ఎలాంటి పరిశీలన చేయకుండానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తున్నారు.
శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో రిసార్టులు అడుగడుగునా ఉన్నాయి. తరచూ ఈ రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్రాంగం గట్టి నిఘా సారిస్తే ఎలాంటి అవకతవకలు చోటుచేసుకునే ఆస్కారం లేదు.
అయితే, కొంతకాలంగా రిసార్టుల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో పలు రిసార్టులో వ్యభిచారం, ముజ్రా పార్టీలు, కోళ్ల పందేలు తదితరాలు వెలుగులోకి వచ్చాయి. రిసార్టు నిర్వాహకులు అనుమతులు తీసుకునేది ఒక దానికి.. వాస్తవానికి వాటిలో జరుగుతున్నది మరోటి అన్నవిధంగా ఉంది.
రిసార్టులో హత్య కలకలం
కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు.
తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్‌లైన్‌లో గది బుక్ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. రిసార్టు నిర్వాహకులు సాయిప్రసాద్‌ను సరిగా తనిఖీలు చేసి ఉంటే ఓ అమ్మాయి ప్రాణం దక్కేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కనిపించని తనిఖీలు
సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లతోపాటు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు మెటల్ డిటెక్టర్లు వినియోగించి ప్రజలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం. అయితే, నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పరిశీలించి గదులను అద్దెకు ఇవ్వాలి.
అయితే, నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. సంఘటన జరిగినప్పుడే పోలీసులు, అధికారులు హడావుడి చేసి.. కొద్దిరోజులకు విస్మరిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిబంధనలు పాటించాల్సిందే
రిసార్టు నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. ఖచ్చితంగా విజిటర్స్ ఐడీ ప్రూఫ్ తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు మా దృష్టికి వస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తాం. – పీవీ పద్మజరెడ్డి, డీసీపీ శంషాబాద్
Comments
Please login to add a commentAdd a comment