ఆ ఐదుగురు ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరులే | ISIS Supporters Arrest In Tamil Nadu | Sakshi
Sakshi News home page

రంగంలోకి ఎన్‌ఐఏ

Published Tue, Sep 4 2018 10:45 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ISIS Supporters Arrest In Tamil Nadu - Sakshi

హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌ను హతమార్చేందుకు కుట్రపన్నినయువకులు ఐఎస్‌ఐఎస్‌ మద్దతుదారులుగా తేలింది. ఆఐదుగురినీ కోయంబత్తూరు కేంద్ర కారాగారానికి తరలించారు. తమిళనాట ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరులు చిక్కినసమాచారంతో నేషనల్‌ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వర్గాలు రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యాయి.

సాక్షి, చెన్నై :  హిందూ సంఘాల నేతల్ని గురిపెట్టి ఇటీవల దాడులు సాగుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు సాగిస్తున్న ఈ దాడి కేసుల విచారణ పోలీసులకు సవాలుగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థలకు చెందిన సానుభూతిపరులు చాప కింద నీరులా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తరచూ ఎన్‌ఐఏ వర్గాలు కోయంబత్తూరు, మదురై, తిరునల్వేలి జిల్లాల్లో చడీచప్పుడు కాకుండా పలువుర్ని అరెస్టుచేసి తమ వెంట తీసుకెళుతున్నాయి.

ఈ పరిణామాలతో రాష్ట్రంలో నిషేధిత ఐఎస్‌ఐఎస్‌ కదలికలు పెరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తమిళ యువకుల పేర్లు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్, ఆయన కుమారుడు ఓంకార్‌ బాలాజీ, అధికార ప్రతినిధి ముక్కాంబికై మణిలను హతమార్చేందుకు చెన్నైలో పథకం వేసినట్టు తెలుసుకుని పోలీసులు మేల్కొన్నారు. తమకు అందిన రహస్య సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలు క్రైం బ్రాంచ్‌కు చేరవేశాయి. రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్‌ పోలీసులు పథకం ప్రకారం చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్లిన  జాఫర్‌ సాధిక్‌ అలీ, ఇస్మాయిల్, సంసుద్దీన్, జలాలుద్దీన్, ఆషిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి వద్ద ఆదివారం పొద్దు పోయే వరకు విచారణ సాగింది.

ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులు
పట్టుబడ్డ యువకులను విచారించగా హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌ హత్యకు రచించిన వ్యూహం వెలుగులోకి వచ్చింది. మరింత లోతుగా విచారణసాగగా, ఈ ఐదుగురు ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరులుగా తేలింది. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్‌ఐఎస్‌ వర్గాలతో సంప్రదింపుల్లో ఉంటూ, వారు ఇచ్చే సూచనలు, సందేశాల మేరకు ఇక్కడ సామాజిక మాధ్యమాల్ని అస్త్రంగా చేసుకుని హిందూసంఘాల నేతలకు బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేస్తునట్టు గుర్తించారు. అలాగే, తమకు అందిన సమాచారంతో పథకం ప్రకారం అర్జున్‌ సంపత్,ఆయన తనయుడు ఓంకార్‌తో పాటు మరొ కర్ని గురిపెట్టి కోయంబత్తూరులో అడుగుపె ట్టి అడ్డంగా బుక్కయ్యారు. వీరికి సహకారంగా కోయంబత్తూరులో మరి కొందరు నక్కి ఉన్నట్టు లభించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.అజ్ఞాతంలో ఉన్న ఆ వ్యక్తుల కోసం గాలింపు సాగుతోంది.

కేంద్ర కారాగారానికి తరలింపు
పట్టుబడ్డ ఐదుగుర్ని కోయంబత్తూరు కేంద్ర కారాగారంలో బంధించారు. తమిళనాట మళ్లీ ఐఎస్‌ఐఎస్‌ పేరు తెర మీదకు రావడం, ఐదుగురు పట్టుబడ్డ సమాచారంతో ఎన్‌ఐఏ వర్గాలు రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న జాబితా మేరకు, తాజాగా పట్టుబడ్డ వారి వద్ద విచారణ సాగించేందుకు నిర్ణయించాయి. ఒకటి రెండు రోజుల్లో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం వర్గాలు కోయంబత్తూరుకు రాబోతోంది. తమిళనాడు పోలీసుల అదుపులో ఉన్న ఐదుగుర్ని కోర్టు ద్వారా తమ కస్టడీకి తీసుకునేందుకు తగ్గ ప్రయత్నాలు చేపట్టి ఉండటం గమనార్హం. ఇక, రాష్ట్రంలో ఐఎస్‌ఐఎస్‌ కదికలు వెలుగులోకి రావడంతో హిందూ సంఘాల నేతలందరికీ భద్రతను పెంచారు. ప్రధానంగా 35 మంది నాయకులకు సాయుధ భద్రత కల్పించారు. వినాయక చవితి పర్వదినం వేళ సమీపించనున్న దృష్ట్యా, మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement