అనంతపురం, తాడిపత్రి: చిన్నపొలమడ సమీపంలోని ప్రబోధాశ్రమంపై 2018 సెప్టెంబర్ 17న జరిగిన దాడి చేసిన కేసులో జేసీ సోదరుల (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరులను తాడిపత్రి రూరల్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆకుల చంద్రశేఖర్, బాబు (బార్ బాబు), మిద్దె హనుమంతరెడ్డి, గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్ చింబిలి వెంకరమణ ఉన్నారు. జేసీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు, బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు దద్దం సుబ్బరాయుడు ముందస్తు సమాచారంతో పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలిసింది. అరెస్టయిన నలుగురినీ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారిని రిమాండ్‌కు ఆదేశించారు.
మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం?
ప్రబోధాశ్రమ ఘటనలో పాల్గొన్న మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కేవలం 25 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో జేసీ సోదరులు వేలాదిమంది అనుచరులతో కలిసి ఆశ్రమంపైన, అక్కడి భక్తులు, వాహనాలపైన దాడిచేసిన విషయం విదితమే. త్వరలోనే మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment