పట్టుకున్న ట్రాక్టర్లను చూపుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్‌క్రైం: పదమూడు ఏళ్లుగా రెండు తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగ కొత్తపల్లిరాజు అలియాస్ బానోత్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.అతని వద్దనుంచి రూ.20 లక్షల విలువైన ట్రాక్టర్లు, ట్యాంకర్లు స్వాధీనం చేస్నుఆ్నరు. హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజు అలియాస్ బానోత్ రాజు(40) స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో చెడువ్యసనాలకు బానిసై డబ్బుకోసం చోరీలు చేయడం ప్రారంభించాడు.అతడి భార్య వదిలివెళ్లిపోవడంతో ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. తనుకూడా ప్రస్తుతం రాజుతో ఉండడం లేదు. దీంతో ఒంటరిగా ఉంటూ చెడువ్యసనాలకు అలవాడు పడ్డాడు. బస్సుల్లో, రైళ్లలో దూరప్రాంతాలు తిరుగుతూ.. రోడ్డు పక్కన నిలిపిఉంచిన ట్రాక్టర్లు, వాటర్‌ట్యాంకర్లపై నిఘా ఉంచేవాడు. ఈ క్రమంలో సమీపగ్రామంలో తిష్టవేసి సమయాన్ని చూసుకుని ట్రాక్టర్లు, ట్యాంకర్లు చోరీ చేస్తాడు. తెలంగాణ చోరీచేసిన వాటిని ఆంధ్రాలో, ఆంధ్రాలో చోరీ చేసిన వాటిని తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు.
రెండేళ్లు జైలులో ఉండి..
ఈ క్రమంలో ఓ జిల్లాపోలీసులకు చిక్కాడు. రెండేళ్లు జైలు జీవితం అనుభవించాడు. బయటికి వచ్చాక సొంతగ్రామం నుంచి ఓ మారుమూల గ్రామానికి మకాం మార్చాడు. అప్పటి నుంచి మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు.వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ చోరీచేసి.. దానికి ఇద్దరు పేరున్న రాజకీయ నాయకుల ఫొటోలు అంటించి సబ్సిడీ ట్రాక్టర్‌గా చెప్పుకుంటూ తిరిగేవాడు. దాని సాయంతో కరీంనగర్ టూటౌన్ పరిధిలో, కొత్తపల్లి మండలం పరిధిలో రెండు వాటర్ ట్యాంకర్లు చోరీ చేశాడు.
పక్కా నిఘాతో..
చోరీ విషయమై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఏసీపీ సూచనలతో సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చోరీజరిగిన ప్రాంతాలను పరిశీలించి రాజే నిందితుడిగా గుర్తించారు. అతడిపై నిఘా ఉంచారు. బుధవారం ఉదయం తాను చోరీ చేసిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాంకర్లను ఆటోనగర్‌లో అమ్మడానికి రాజు వస్తుండగా పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.20 లక్షల విలువైన మాచారెడ్డి, చిల్లకల్లులో చోరీ చేసిన రెండు ట్రాక్టర్లు, బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన ఓ ట్రాలీ, చిల్లకల్లు, సూర్యపేట, కరీంనగర్ టూటౌన్ పీస్‌ల పరిధిలో చోరీకి గురైన నాలుగు వాటర్ ట్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, ఎస్సై నాగరాజు,సిబ్బందికి నగదు రివార్డు అందించారు.
సీఐకి కిరణ్‌కు ఎంఎస్‌ఈకి రికమండ్
పలు నేరాల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకు న్న సీసీఎస్ సీఐ ఎర్రల కిరణ్‌ను ఎంఎస్‌ఈ(మెరిటోరియర్స్ సర్వీస్ ఎంట్రీ) మెడల్‌కు రికమండ్ చేస్తున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు.
త్వరలో ట్రాఫిక్ సిగ్నళ్లు
కరీంనగర్ మరో రెండు నెలల్లో సుమారు 18 జంక్షన్ల వద్ద ట్రాపిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిని నియంత్రించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment