ప్రతీతాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్: హన్మకొండలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో ఉంటున్న అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘మామయ్య నేను హైదరాబాద్‌లో వేరే చోట ఉన్నాను. అర్జంటుగా పద్నాలుగు లక్షల రూపాయలు రెడీ చేయండి. ఎందుకు ? ఏమిటీ అనే వివరాలు మీకు తర్వాత చెప్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అదే నంబర్‌కు మళ్లీమళ్లీ ఫోన్ చేస్తే... అవతలి వైపు వ్యక్తులు మారుతున్నారు.. కానీ డబ్బులు సిద్ధం చేయాలనే డిమాండ్ మారడం లేదు. దీంతో అల్లుడు కిడ్నాప్ అయ్యాడని భావించిన మామ నగదు సిద్ధం చేసే పనిలో పడిపోయాడు. ఒక్కరోజులో అంత డబ్బు సర్దుబాటు చేయలేక ఇబ్బందిపడ్డాడు. శ్రేయోభిలాషుల ద్వారా ఓ మాజీ ఎంపీకి సమస్య చెప్పుకున్నాడు. అలాఅలా విషయం పోలీసులకు చేరింది.
పబ్లిక్ గార్డెన్‌లో అనుమానితులు అదుపులోకి..
ఒకేసారి రూ.14 లక్షలు సర్దుబాటు చేయలేమని, కేవలం రూ.4 లక్షలు ఇవ్వగలనంటూ మామ ఫోన్‌లో అవతలి వ్యక్తులకు చెప్పాడు. ఈ నగదుతో తాము హైదరాబాద్ రాలేమని, మీరే వరంగల్ రావాలంటూ కోరాడు. సాయంత్రం పబ్లిక్ గార్డెన్‌లో నగదు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బుల కోసం ముగ్గురు వ్యక్తులు బయల్దేరారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు పబ్లిక్ గార్డెన్‌కు వచ్చి డబ్బులు తేవాల్సిందిగా ఫోన్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో అక్కడే వేచి ఉన్నారు. తీరా డబ్బులు ఉన్నట్లుగా భావిస్తున్న బ్యాగును ఇచ్చే సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ హఠత్‌పరిమాణానికి వారిలో ఒకరు పారిపోగా .. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడే ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి.
బాకీ తగాదాయే కారణం..
ఉమ్మడి వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఇతర పార్ట్‌నర్లతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో పార్ట్‌నర్లకు భారీ మొత్తంలో బాకీపడ్డాడు. బాకీ ఎంతకు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లో ఓ పోలీస్‌స్టేషన్‌కు పం చాయతీ చేరింది. అక్కడ విషయం సెటిల్ చేసేందుకు రంగం సిద్ధమైంది. భాగస్వాములు,పోలీసుల నుంచి ఒత్తి డి పెరగడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి... తన అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వాలంటూ వరంగల్‌లో ఉన్న మామను ఫోన్‌లో కోరాడు. మొత్తం విషయం చెప్పకుండా అర్జంటుగా డబ్బులు కావాలంటూ కంగారుగా, గాబరాగా చెప్పడంతో అల్లుడు కిడ్నాప్ అయినట్లుగా మామ భయపడ్డాడు. చివరకు కిడ్నాప్ జరగలేదని, పార్ట్ నర్ల మధ్య తగదా అని తేలడంతో కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment