కోగంటే సూత్రధారి! | Koganti Satyam May Key Role In Ram Prasad Murder Case | Sakshi
Sakshi News home page

కోగంటే సూత్రధారి!

Published Fri, Jul 12 2019 3:42 AM | Last Updated on Fri, Jul 12 2019 3:42 AM

Koganti Satyam May Key Role In Ram Prasad Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్‌ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితమే ఆయన హత్యకు నిందితులు కుట్ర పన్నినట్లు ప్రధాన నిందితుడైన కోగంటి సత్యం విచారణలో వెలుగుచూసింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో హత్య అమలు వాయిదా పడింది. రాంప్రసాద్‌ కదలికలపై మొత్తం మూడుచోట్ల రెక్కీ నిర్వహించిన నిందితులు.. కుట్ర అమలుకు అనుకూలంగా ఉంటుందనే పంజగుట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నారని బయటపడింది. ఈ కేసులో కోగంటి సత్యం సహా మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి వరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ హత్య పథక సూత్రధారి కోగంటి సత్యమే అని కూడా నిర్ధారణకు వచ్చారు. రాంప్రసాద్‌ను చంపేందుకు కిరాయి హంతకులకు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.

రంగంలోకి దిగిన ప్రధాన అనుచరుడు..
విజయవాడకు చెందిన కామాక్షి స్టీల్స్‌ వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాలు, మధ్యలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం.. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం తదితర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్‌ను హత్య చేయాలని కోగంటి సత్యం నిర్ణయించుకున్నాడు. ఆ పనిని తన ప్రధాన అనుచరుడైన శ్యామ్‌కు అప్పగించాడు. ఎన్నికల కారణంగా పోలీసుల తనిఖీలు విస్తృతంగా ఉండడం.. రాంప్రసాద్‌ ఆచూకీ స్పష్టంగా తెలియకపోవడంతో కోగంటి సత్యం తన పథకాన్ని వాయిదా వేశాడు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత శ్యామ్, సురేష్‌లు తమ అనుచరుడైన ఆనంద్‌ను రంగంలోకి దింపి రాంప్రసాద్‌ ఆచూకీ కనిపెట్టే బాధ్యత అప్పగించారు.

గది అద్దెకు తీసుకుని గాలింపు..
విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆనంద్‌ ఓ గది అద్దెకు తీసుకుని గాలింపు మొదలు పెట్టాడు. చివరకు రాంప్రసాద్‌ ఆచూకీ కనిపెట్టిన అతను.. పరిగిలో రాంప్రసాద్‌ నిర్వహిస్తున్న అభిరామ్‌ స్టీల్స్‌ ఫ్యాక్టరీ, గచ్చిబౌలిలోని నివాసం, పంజగుట్టలోని కార్పొరేట్‌ కార్యాలయాలను గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్, సురేష్‌లు.. హైదరాబాద్‌ వచ్చి ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఫ్యాక్టరీ వద్ద దాడిచేస్తే కార్మికులు చూసి తమను పట్టుకోవడం, ఎదురుదాడి చేయడం లేదా రాంప్రసాద్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశం ఉందని భావించారు. ఇంటి వద్ద కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉండటంతో అక్కడ కూడా దాడి చేయకూడదని నిర్ణయించుకున్నారు.

పంజగుట్టలో అభిరామ్‌ స్టీల్స్‌ కార్యాలయం సమీపంలో ఉన్న దేవాలయం వద్దే అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కోగంటి సత్యంకి చెప్పడంతో అతడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన శ్యామ్, చోటు, రమేష్‌ తదితరులు గత శనివారం రాత్రి రాంప్రసాద్‌ను మట్టుబెట్టారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం పది మందికి పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోగంటి సత్యం, శ్యామ్, చోటు, రమేష్, ఆనంద్, సురేష్‌ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. నిందితుల్ని శుక్రవారం అరెస్టుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే హత్యకు వినియోగించిన వాహనాలు, ఆయుధాలు, సెల్‌ఫోన్లు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులపై నేరం నిరూపించడానికి అవసరమైన ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు తీరు తెన్నుల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు నిందితులకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.

రోడ్డు ప్రమాదం తర్వాతే హత్యకు ప్రణాళిక
రెండు నెలల కిందట మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అప్పట్లో దీనిపై ఆయన ఎవరిపై అనుమానం వ్యక్తంచేయలేదు. అయితే, ఈ ప్రమాదం వెనుక రాంప్రసాద్‌ హస్తమున్నట్లు గుర్తించిన సత్యం.. మరోవైపు కామాక్షి స్టీల్స్‌ వ్యాపార లావాదేవీల వివాదం తీవ్రరూపం దాలుస్తుండడంతో భవిష్యత్తులో అతని నుంచి తనకెదురయ్యే ముప్పును తప్పించుకునేందుకే రాంప్రసాద్‌ హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం రూ. కోటి వరకు సత్యం సుపారీ ఇచ్చినట్లు.. ఈ చెల్లింపులన్నీ శ్యామ్‌ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉంటే.. రెండు దశాబ్దాలుగా స్టీలు వ్యాపార రంగంలో ఉన్న కోగంటి సత్యంపై విజయవాడ నగరంలో మొత్తం 24 కేసులున్నాయి. ఏ–1 రౌడీషీట్‌ కూడా ఉంది. వైజాగ్, విజయవాడలో ఆస్తి, వ్యాపార తగాదాలు ఉన్నాయి. ఇందులో మూడు కేసులు మినహా అన్ని కేసులు కొట్టేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement