బ్యాంకాక్ : జెయింట్ క్లామ్ ఆల్చిప్ప నటి కొంపముంచింది. అంతరించిపోతున్న ఆల్చిప్ప జాతికి చెందిన జీవిని పట్టుకున్న కారణంగా సౌత్ కొరియా నటికి ఐదేళ్ల జైలు శిక్ష పడనుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాకు చెందిన లీ ఇయోల్ ఎమ్ అనే నటి గత కొద్దినెలలుగా ‘‘లా ఆఫ్ ది జంగిల్’’ అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. జూన్ 30వ ఎపిసోడ్ చిత్రీకరించటానికి రియాలిటీ షో టీం బ్యాంకాక్‌లోని థాయ్ మెరైన్ నేషనల్ పార్క్‌కు వచ్చింది. షోలో భాగంగా సముద్రంలోకి దిగిన లీ ఇయోల్ ఎమ్ నీటి అడుగున ఉన్న ఆల్చిప్పలను బయటకు తీసువచ్చారు. అవి అంతరించిపోతున్న జాతికి చెందినవని ఆమెకు తెలియదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ‘హట్ చావో మాయ్ నేషనల్ పార్క్’ అధికారులు నేషనల్ పార్క్, థాయ్ వన్య ప్రాణుల సంరక్షణా చట్టాలను ఉల్లంఘించిందంటూ ఆమెపై కేసు పెట్టారు.
నటిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకోసం అన్వేషణ ప్రారంభించారు. రియాలిటీ షో నిర్వాహకులు క్షమాపణలు చెప్పినప్పటికి వన్య ప్రాణి సంరక్షణా అధికారులు కేసు వెనక్కితీసుకోవటానికి ఒప్పకోలేదు. థాయ్ మెరైన్ నేషనల్ పార్క్ అధికారి నారంగ్ కొంగైడ్ మాట్లాడుతూ.. ‘‘ నటిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు కోర్టు పరిథిలో ఉంది. ఆమెను శిక్షించాలా లేక వదిలేయాలా అన్నది కోర్టుకు సంబంధించిన విషయ’’ మని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment