ఉరికి వేలాడుతున్న పృధ్వీరాజు,సాయిదివ్యల మృతదేహాలు, 12వ తేదీ రాత్రి హోటల్ రిసెప్షన్‌లో గదిని బుక్ చేసుకుంటున్న పృధ్విరాజు, సాయిదివ్య
గుంటూరు, తెనాలిరూరల్: చేసిన పొరపాటు వల్ల కుటుంబ సభ్యులకు మొహం చూపలేమన్న కారణం, తప్పు చేశామన్న పశ్చాత్తాపంతోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దారా పృధ్విరాజు, ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య తెనాలి గాంధీచౌక్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో శవపంచనామాను మంగళవారం నిర్వహించలేకపోయారు. హోటల్ గది తలుపును బుధవారం అధికారుల సమక్షంలో పోలీసులు పగులగొట్టించారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.
మృతదేహాల వద్ద మూడు పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఇందులో ఉన్న వివరాల మేరకు 9వ తేదీన విజయవాడలో రహస్యంగా వివాహం చేసుకుని, వైఎస్సార్ నగర్‌లో కాపురం పెట్టారు. సాయిదివ్య ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు విజయవాడలో వీరు ఉంటున్న ప్రదేశాన్ని 12వ తేదీన గుర్తించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి, రాత్రికి తెనాలిలోని హోటల్‌కు చేరారు. గది అద్దెకు తీసుకుని, తమ వెంటే తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఇద్దరి విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో తప్పుచేశామన్న భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు, భార్యకు మొహం చూపలేనన్న ఉద్దేశంతో పృధ్విరాజు, తల్లిదండ్రులు, మేనమామలకు మొహం చూపలేనన్న కారణంతో సాయిదివ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో రాసి ఉంది. ఇద్దరూ తమ తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరుతూ, తమ మరణ సమయాన్ని ఈ నెల 13వ తేదీన తెల్లవారుజామున మూడు గంటలుగా నోట్‌లో రాసిపెట్టారు. తప్పు చేశామన్న ఆత్మన్యూనతా భావంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నట్టు తెనాలి వన్‌టౌన్ సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment