మనస్పర్థలతో ప్రేమికుల ఆత్మహత్య | Lovers suicides with misunderstandings | Sakshi
Sakshi News home page

మనస్పర్థలతో ప్రేమికుల ఆత్మహత్య

Published Tue, Sep 18 2018 4:02 AM | Last Updated on Tue, Sep 18 2018 4:02 AM

Lovers suicides with misunderstandings - Sakshi

ఎల్లేశ్‌(ఫైల్‌), లావణ్య(ఫైల్‌)

శంకర్‌పల్లి: క్షణికావేశం రెండు నిండు జీవితాలను బలిగొంది. మనస్పర్థలు ప్రేమజంట బలవన్మరణాలకు కారణమయ్యాయి. వివరాలు... రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూర్‌కు చెందిన సురగళ్ల సత్తయ్య, ప్రకాశం కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. సత్తయ్య కుమారుడు ఎల్లేశ్‌(22) ఇంటర్‌ వరకు చదువుకుని గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం కూతురు లావణ్య(19) పదో తరగతి వరకు చదువుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. ఎల్లేశ్, లావణ్య వరు సకు బావ మరదళ్లు. వీరు చాలారోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికీ తెలియదు. కాగా, గ్రామంలో ఆదివారం రాత్రి స్నేహితులతో సరదాగా గడుపుతూ మధ్యలో లావణ్యకు ఫోన్‌ చేశాడు. ఏదో విషయమై ఇద్దరూ ఫోన్‌లో గొడవపడ్డారు. ఆమె ఫోన్‌ కట్‌ చేయడంతో ఎల్లేశ్‌ ఆవేశంగా ఇంటికి వెళ్లి  కుటుంబసభ్యులతోనూ గొడవ పడ్డాడు. బయటకు వచ్చి కొంతమందికి ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని, బతకడం ఇష్టం లేదని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొన్నాడు. విషయం తెలుసుకున్న లావణ్య ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మనస్పర్థల వల్లే ప్రేమికులిద్దరు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఇరు కుటుంబాలు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement