‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు | Man Arrest in Parcel Case Hyderabad | Sakshi
Sakshi News home page

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

Aug 27 2019 11:38 AM | Updated on Aug 27 2019 11:38 AM

Man Arrest in Parcel Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సహా పదుల సంఖ్యలో ప్రముఖులకు మురికినీరు, బురద పార్శిల్‌ చేసి పంపడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు వొడ్డాపల్లి వెంకటేశ్వర్‌రావును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అతను తన మాజీ క్లాస్‌మేట్‌తో పాటు ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్లపై కక్ష సాధించేందుకు వారి పేర్లు ఫ్రమ్‌ అడ్రస్‌లో రాసి ఈ పని చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని కమ్మరివాడికి చెందిన వెంకటేశ్వర్‌రావు బొల్లారంలోని ఉస్మానియా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో కొన్నేళ్ల క్రితం ఎంబీఏలో చేరాడు. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో అది పూర్తి కాలేదు. తాను అన్ని పరీక్షలు సక్రమంగానే రాశానని, వర్శిటీ ప్రొఫెసర్లే ఉద్దేశపూర్వకంగా తనను ఫెయిల్‌ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ఇతడితో పాటు అదే కళాశాలలో నగరానికి చెందిన ఓ యువతి సైతం ఎంబీఏలో చేశారు. అప్పట్లో ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నించి విఫలమైన వెంకటేశ్వర్‌రావు ఆమెపై కక్షకట్టి అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు  ఓయూ ప్రొఫెసర్ల పైనా ఒకేసారి పగ తీర్చుకోవాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో వారే పంపినట్లు ప్రముఖులను మురికినీరు, బురద పార్శిల్‌ చేయాలని భావించాడు. ఈ నెల 16న ఆటోలో 62 పార్శిల్స్‌ను ప్యాట్నీలోని హెడ్‌–పోస్టాఫీస్‌కు తీసుకువచ్చాడు.

అప్పటికే సమయం మించిపోయిందని సిబ్బంది చెప్పడంతో మర్నాడు వస్తానని చెప్పి వాటిని అక్కడే ఉంచి వెళ్ళాడు. 17న ఉదయం పోస్టాఫీస్‌కు వచ్చిన వెంకటేశ్వర్‌రావు ముఖ్యమంత్రికి చెందిన నాలుగు చిరునామాలు, డీజీపీతో పాటు ప్రముఖులతో కలిపి మొత్తం 62 మందికీ  ఆ బాక్సుల్ని పంపాలంటూ వారి చిరునామాలు ఇచ్చి బుక్‌ చేయించాడు. ఇందుకుగాను రూ.7216 చెల్లించాడు. ఎక్కడా తన గుర్తింపు బయటపడకుండా బోగస్‌ వివరాలు ఇచ్చాడు. ఓ పార్శిల్‌పై మాత్రం ఫ్రమ్‌ అడ్రస్‌గా తన మాజీ క్లాస్‌మేట్‌ పేరు, ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ల పేర్లు రాశాడు. ఈ నెల 19న పోస్టాఫీసు డిస్పాచ్‌ సిబ్బంది వాటిని తరలించేందుకుగాను ఓ బాక్సును పైకి ఎత్తగా లోపల ద్రవ పదార్థం ఉన్నట్లు అనుమానించి తెరిచి చూడగా అందులో రెండు బాటిళ్ళల్లో మురుగునీరు, బురద ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది వాటిని రసాయనాలుగా, ప్రముఖులకు పంపాలని చూడటంతో దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానించారు.

దీంతో మహంకాళి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైంటిఫిక్‌ అధికారుల్ని రప్పించి పరీక్షలు చేయించగా, అవి డ్రైనేజ్‌ వాటర్, బురదగా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న మురుగునీరు, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఈ పని చేసి ఉంటారని భావించారు. అయితే ముఖ్యమంత్రికి అడ్రస్‌ చేసిన పార్శిల్‌పై ఓ మహిళతో పాటు ఓయూ వీసీ ఎస్‌.రామచంద్ర, ప్రొఫెసర్‌ విఠల్‌ పేర్లు ప్రస్తావించాడు. సదరు మహిళ ‘ఏజీఏఏఆర్‌ఏఎల్‌ఆర్‌ఓ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నట్లు వెంకటేశ్వర్‌రావు పేర్కొనడంతో అనుమానించిన  సీనియర్‌ పోస్టు మాస్టర్‌ వెంకట రమణరెడ్డి గత మంగళవారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. పోస్టాఫీసు మార్గంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు సాకేంతికంగానూ దర్యాప్తు చేసి ఆ బాక్సుల్ని తీసుకువచ్చిన ఆటోను గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వెంకటేశ్వర్‌రావు చిరునామా బయటపడింది. దీంతో అతడిని పట్టుకోగా నేరం అంగీకరించాడు. ఇతడి నుంచి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ల్యాప్‌టాప్, ప్రింటర్, ద్విచక్ర వాహనం తదితరాలు స్వాధీనం చేసుకుని మహంకాళి పోలీసులకు అప్పగించారు. ఇతడు తన మాజీ క్లాస్‌మేట్‌ పేరుతో పాటు డాటరాఫ్‌ అంటూ ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడి పేరు రాశాడు. ఆయన ఆమె సమీప బంధువే తప్ప తండ్రి కాదని పోలీసులు నిర్థారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement