
సాక్షి, విజయవాడ: గన్నవరం పోలీసులు తమను వేధిస్తున్నారని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఓ కేసు విషయంలో తమను వేధిస్తున్నారని కోటేశ్వర్‌రావు, రామాంజనేయులు అనే ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఎలుకల మందు తాగారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. కోటేశ్వర్‌రావు మృతి చెందారు. పోలీసుల వేధింపుల వల్లే కోటేశ్వర్‌రావు చనిపోయాడని ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. తమ్ముడిపై పోలీసులు అక్రమంగా కేసుపెట్టి వేధించడంతోనే కోటేశ్వర్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడని, అక్రమ కేసుతో పోలీసులు తమను వేధించారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజే పోలీసులు సమస్యను పరిష్కరించి ఉంటే కోటేశ్వర్‌రావు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదని వారు అంటున్నారు.