మృతిచెందిన బుచ్చయ్య
వాజేడు : మండల పరిధిలోని చీకుపల్లి బ్రిడ్జి వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు గజ్జల బుచ్చయ్య(85) 45 మీటర్ల ఎత్తు నుంచి లోయలోని నీళ్లలోపడి అక్కడికక్కడే మృతిచెందగా కారు మరో వైపు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని తలపించింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా మిగతా వారిని స్థానికులు రక్షించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన గజ్జల బుచ్చయ్య(85) ప్రతీ రోజు బొగత జలపాతం గ్రామానికి నడిచి వెళ్లి తిరిగి రావడం అలవాటు. రోజూలాగే మంగళవారం కూడా బొగత జలపాతానికి వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో పరకాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఏపీ 9 బీజే 0137 నంబర్ కారులో బొగత జలపాతానికి వస్తున్నారు. అతివేగంగా వస్తున్న కారును చీకుపల్లి బ్రిడ్జి వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో అదుపు చేయలేకవడంతో రోడ్డు పక్కన నడుస్తున్న బుచ్చయ్యను ఢీకొట్టారు.
దీంతో బుచ్చయ్య రోడ్డుపై సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగిరి 35 మీటర్ల లోతు లోయలోని నీటిలో పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. బుచ్చయ్యకు కారు తగలగానే ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ ఎదురుగా లోయ ఉండటంతో ఎడమ చేతి వైపునకు తిప్పగానే కారు మరో పక్క లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు రెండు బ్రేకులను వేయడంతో బండి మీద ఉన్న దంపతులు కింద పడిపోయారు.
లేదంటే వీరు కూడా కారు ప్రమాదానికి గురయ్యేవారు. ఈ ఘటనలో కారు మొత్తం నుజ్జనుజ్జయ్యింది. లోయలో కారు తిరగబడి ఉండడంతో అందులో ఉన్న ఏడుగురికి ఊపిరాడలేదు. అక్కడ ఉన్న స్థానికులు కారునుపైకి లేపి అందులోని వారిని బయటకు తీశారు. కారులో ఉన్న నాగరాజు, డ్రైవర్‌కు గాయాలు కాగా మిగతా వారు క్షేమంగా బయటపడ్డారు. కారును పైకి లేపి ఉండకపోతే మిగతా వారు కూడా మృత్యువాతపడే వారని స్థానికులు తెలిపారు.
కారులో ఉన్న అందరూ పూటుగా తాగి కారును నడుపుతున్నారని సంఘటన స్థలానికి చేరుకున్న చీకుపల్లి, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గుమ్మడిదొడ్డి గ్రామస్తులు, బంధువులు విషయాన్ని ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్‌కు తెలియజేయటంతో ఆయన ఘటన స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment