
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తాను ఈ చర్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. మంగళూరు ఎయిరుపోర్టు ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు(36) అనే వ్యక్తి తమకు లొంగిపోయాడని తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అతడిని మంగళూరు టీంకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్ కౌంటర్ వద్ద విమానాశ్రయ పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సదరు బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లుగా గుర్తించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. కట్టుదిట్టమెన భద్రత నడుమ సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అతడు పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment