అరెస్ట్ అయిన మిలీషియా మండల కమాండర్ భీమన్నతో సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీను
జి.మాడుగుల(పాడేరు): మావోయిస్టు మండ ల మిలీషియా కమాండర్ పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలంలో నుర్మతి రోడ్డు కంబాలు బయలు గ్రామం సమీపంలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాంగి భీమన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు చెప్పారు. మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. మండలంలో బొయితిలి పంచాయతీ మండిభ గ్రామానికి చెందిన పాంగి భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు 12 సంవత్సరాలు నుంచి మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా పని చేస్తూ, మండల పరిధిలో మిలీషియా కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
నుర్మతి–మద్దిగరువు రోడ్డులో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు పొక్లెయిన్లను దగ్ధం చేసిన ఘటన, మద్దిగరువుకు చెందిన కొలకాని సూర్యా, ముక్కల కిశోర్‌కుమార్‌లను హతమార్చిన సంఘటన, పెదబయలు మండల జక్కం వద్ద మందుపాతర పేల్చిన సంఘటనలో భీమన్న అలియాస్ మల్లేశ్వరరావు పాత్ర ఉన్నట్టు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. భీమన్నను మావోయిస్టులు బలవంతగా తీసుకెళ్లి ఈ ఘటనలు చేయించారని ఆయన చెప్పారు. భీమన్నపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే ఎటువంటి కేసులు లేకుండా వారి ఇళ్లకు పంపించేస్తామని సీఐ చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment