గుడిసె ఎదుట విజేందర్ తల్లి, గ్రామస్తులు
చిట్యాల(భూపాలపల్లి) : పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పేదల రాజ్యం సిద్ధించాలనే లక్ష్యంతో చార్‌మజూందార్ ఏర్పాటు చేసిన పీపుల్స్‌వార్ గ్రూపు లో చేరి 18 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసిన రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అలి యాస్ శ్రీను(40) ఉద్యమ ప్రస్థానం మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విజేందర్ మరణవార్త పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి అహల్య సొమ్మసిల్లిపోయింది. తమ్ముడు, కుమార్తె కన్నీటిపర్యంతమయ్యారు.
ఉద్యమానికి ఊపిరి ‘చల్లగరిగె..’
చిట్యాల మండలంలో వెలిశాల తర్వాత చల్లగరిగె గ్రామం అప్పటి పీపుల్స్‌వార్‌కు ఊపిరిగా మారింది. ఈ గ్రామాల్లో 1200 మంది మాజీలు ఉన్నారు. 12 మంది అజ్ఞాతంలోకి వెళ్లగా కొందరు లొంగిపోయారు. అందులో దూడపాక మధు, పోశాల తిరుపతి, గోల్కోండ రమేష్, గంగరబోయిన స్వామి, రౌతు విజేందర్ మృతిచెందారు.
విజేందర్ కుటుంబ నేపథ్యం
మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన రౌతు అహల్య–నర్సింహారాము లు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండవాడైన విజేందర్ స్థానిక హైస్కూల్‌లో పదవ తరగతివరకు చదువుకున్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ బావాలు వ్యక్తపరిచేవాడన్నారు. అదే గ్రామానికి చెందిన మరో అజ్ఞాత నక్సలైట్ సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి ఇద్దరు కలిసి గ్రామంలో పీపుల్స్‌వార్ సానుభూతిరులుగా వ్యవహరించి పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పకడ్భందీగా నిర్వహించేవారని మాజీలు చర్చించుకుంటున్నారు.
బాలల సంఘం ఏర్పాటు
విజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో 1990లో బాలల సంఘం ఏర్పాటు చేశారు. సుధాకర్, మరికొంత మందితో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఉద్యమించాడు. భూస్వాములను, గుత్త పంచాయతీలు చేసే వ్యక్తులను నిలదీసేవాడు. 1996లో రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లో ఆయన చురుకైన పాత్ర నిర్వహించినట్లు పోలీసుల రికార్డులో ఉంది.
సారా ప్యాకెట్లు ధ్వంసం చేయడం, వాల్‌పోస్టర్లు వేయడం, ఎన్‌కౌంటర్లకు నిరసనగా బస్సుల దహనం, పలువురిని చితకబాదిన సంఘటనల్లో విజేందర్ ముఖ్యభూమికను పోషించినట్లు సమాచారం. పోలీసులకు, పాలకులకు భూస్వాములకు ఆయన కంటిలో నలుసులా మారాడు.
1997లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమ నేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం విజేందర్, సుధాకర్‌ను ఆజ్ఞాత ఉద్యమం వైపు నడిపించిందని మాజీలు తెలిపారు. 31 డిసెంబర్ 2000లో విజేందర్ అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపులో చేరాడు.
అంచలంచెలుగా ఎదిగిన విజేందర్
పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అంచలంచెలుగా ఎదిగాడు. ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కడారి రాములుఅలియాస్ బాలన్నకు అంగరక్షకుడి పనిచేశాడు. ఆదిలాబాద్, సిరొంచ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశాడు. ప్రస్తుతం గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. దళ సభ్యురాలు రజితను వివాహం చేసుకోగా పాప జన్మించడంతో చల్లగిరగెలోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. ప్రస్తుతం రమ్య 8వ తరగతి చదువుతోంది.
విజేందర్ కుటుంబానికి పోలీసుల చేయూత..
అజ్ఞాతంలో ఉన్న విజేందర్ కుటుంబానికి పోలీసులు అన్నివిధాలుగా చేయూతనిచ్చారు. అతడు లొంగిపోయేలా చూడాలని సీఐ గండ్రతి మోహన్ తల్లిదండ్రులకు, విజేందర్ కుమార్తె రమ్యకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. బియ్యం, దుస్తులు అందజేశారు. విజేందర్ తండ్రి 9 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోతే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రమ్యను కస్తూర్బాగాందీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించారు.
ఇంకా అజ్ఞాతంలో ముగ్గురు..
ఉత్తర తెలంగాణ ఉద్యమానికి చిట్యాల ఏరియా ఒకప్పుడు వెన్నుదన్నుగా నిలిచింది. వెలిశాల గ్రామం ఉద్యమానికి ప్రయోగశాలగా మారింది. ఇంటికో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు విప్లవ బాట పట్టారు. ఒకే కుటుంబం నుంచి గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేష్, అశోక్ అలియాస్ ఐతు ఉద్యమానికి ఇరుసుగా మారి ఉత్తర తెలంగాణ వరకు విస్తరింపచేశారు.
కేంద్ర కమిటీ సభ్యులుగా రాణిస్తు ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అజ్ఞాతంలో వెలిశాలకు చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్(చర్చల ప్రతినిధి), చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి, రామచంద్రాపూర్‌కు చెందిన క్యాతం రాజు కొనసాగుతున్నారు.
అన్న తిరిగొస్తాడనుకున్న..
అన్న 18 ఏళ్ల క్రితం ఇల్లు ఇడిసి పెట్టి పోయిండు. ఇప్పటి వరకు ఇటు రాలేదు. తిరిగొస్తాడని ఎదురు చూస్తానం. అన్న కోసమే నాన్న బాధపడుతు చనిపోయిండు. అమ్మ అనారోగ్యంతో ఉంది. అన్న కుమార్తె రమ్యను కూలి చేసి పోషిం చుకుంటున్నం. అన్న చావకుండ ఉండాలి. బ్రతికి తిరిగి రావాలి. – కుమారస్వామి, మృతుడి సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment