
హత్యకు గురైన ట్రాక్టరు మెకానిక్ మహబుబ్‌బాషా
కర్నూలు, రుద్రవరం: మండల కేంద్రంలో మెకానిక్ మహబుబ్‌బాషా(39) దారుణహత్యకు గురయ్యాడు. ఎస్‌ఐ చిన్న పీరయ్య యాదవ్ తెలిపిన వివరాలు.. చాకరాజువేములకు చెందిన మహబుబ్‌బాషా రుద్రవరానికి చెందిన గాజుల రంతుల్లా కూతురు హుశేన్‌బీని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే భార్య పుట్టినిళ్లు రుద్రవరానికి వచ్చి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణ సమీపంలో ఉన్న తన షెడ్డులో పనులు ముగించుకుని అక్కడే నిద్రించాడు. అయితే రోడ్డు ప్రమాదంలో మహబూబ్ బాషా తీవ్రంగా గాయపడగా తాము షెడ్డు వద్దకు తీసుకొచ్చామని అర్ధరాత్రి మండల కేంద్రానికే చెందిన జయలక్ష్మి ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా తన భర్తకు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉండేదని, ఆ మహిళలే చంపి ఉంటారని మృతుడి భార్య హుసేన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం..
మహబుబ్‌బాషా భార్య ఫిర్యాదుతో విచారణ నిమిత్తం జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డకు తరలించగా డాక్టర్లు కర్నూలుకు రెఫర్ చేసినట్లు ఎస్‌ఐ చిన్నపీరయ్యయాదవ్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment