
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థి దశలోనే అతని వికృత చేష్టలు ఓ బాలిక జీవితాన్ని చిదిమేశాయి. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఆపై విద్యుత్‌షాక్‌కు గురిచేసి కిరాతకంగా కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దిండుగల్లు జిల్లా ఉత్తర మదురై సమీపం జీ కురుంపట్టికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నోటితో కరెంటు వైరుపట్టుకుని, ఒళ్లంతా రక్తగాయలై విగతజీవిగా పడి ఉండగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగికదాడి చేసి విద్యుత్‌షాక్‌తో హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది.
బాలిక ఇంటికి సమీపంలోని విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానించిన మృతురాలి బంధువులు వారిపై చర్య తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థే నిందితుడుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 16న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడి లైంగిక దాడికి దిగానని, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని అంగీకరించాడు. తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఇంట్లో ఉన్న విద్యుత్ వైరును బాలిక నోటిలో ఉంచి కరెంటు షాక్‌కు గురిచేసి హతమార్చానని ఒప్పుకున్నాడు.