అరెస్టయిన నిర్మలా దేవి(ఫైల్)
సాక్షి, చెన్నై : విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు ప్రయత్నించిన ప్రొఫెసర్ నిర్మలా దేవి వ్యవహారంపై విచారణ ముగిసింది. సీల్డ్ కవర్లో నివేదిక రాజ్ భవన్‌కు చేరింది. వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా రాజ్‌భవన్ వర్గాలు ఆ నివేదికలోని అంశాలను బయటపెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి.
విరుదునగర్ జిల్లా అర్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల గణితం ప్రొఫెసర్ నిర్మలా దేవి లీల ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నలుగురు విద్యార్థినులను ఎంపిక చేసి, ఎవరి కోసమో లైంగిక ప్రేరణకు ప్రయత్నిస్తూ ఆమె సాగించిన ఆడియో బయటపడడం రాష్ట్రంలో వివాదాన్ని రేపింది. విద్యార్థినులకు కళాశాలల్లో భద్రత కరువైందని ఆందోళనలు బయలు దేరాయి. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం తానే స్వయంగా ఓ కమిటీని రంగంలోకి దించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం నేతృత్వంలో విచారణ కమిషన్ రంగంలోకి దిగడం వివాదానికి సైతం దారితీసింది.
రాజ్ భవన్ చేరిన నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన సమయంలో గవర్నర్ ప్రత్యేక విచారణ కమిషన్‌ను రంగంలోకి దించడంతో ప్రతిపక్షాలు పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. అయితే, గవర్నర్ ఏ మాత్రం తగ్గలేదు. తాను నియమించిన కమిటీ ద్వారా విచారణకు చర్యలు తీసుకున్నారు. సంతానం నేతృత్వంలోని కమిషన్ మదురై చెరలో ఉన్న నిర్మలా దేవితో పాటు, ఆమెకు సహకారంగా ఉన్న మురుగన్, కరుప్ప స్వామిలను సైతం విచారించింది. అన్ని ప్రక్రియలు వీడియో చిత్రీకరణగా సాగాయి. పలు కోణాల్లో ఈ కమిటీ విచారణ చేసి నివేదికను సిద్ధంచేసి రాజ్ భవన్‌కు చేర్చింది. మంగళవారం నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచి రాష్ట్ర గవర్నర్‌కు సంతానం అందజేశారు.
అన్ని కోణాల్లో విచారణ
నిర్మలాదేవి వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని విచారణ కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన విచారణ ముగిసిందని, నివేదిక రాజ్ భవన్‌కు చేరిందని వివరించారు. అన్ని కోణాల్లో విచారణ సాగిందని, ప్రధానంగా 60మంది వద్ద సాగిన విచారణలో పలు అంశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఈ విచారణ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా, ఇతర వివరాలు వెల్లడించేందుకు వీలు లేదన్నారు. కాగా, రాజ్ భవన్‌కు సీల్డ్ కవర్లో నివేదిక చేరినా, ఎన్ని పేజీలు ఉన్నాయో, అందులోని వివరాలు ఏమిటీ అనేది గవర్నర్ సైతం తెలుసుకోలేని పరిస్థితి. ఇందుకు కారణం ఈ వ్యవహారం కోర్టులో ఉండడమే. ఈ విచారణ కమిషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కోర్టు సైతం స్పందించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచాలని, అందులోని అంశాలను, వివరాలను బయటపెట్టేందుకు వీలు లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చి ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment