ప్రతీకాత్మక చిత్రం
వనపర్తి క్రైం : ఇంటి నుంచి వెళ్లిన ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరే వరకు కన్నవారికి భయం తప్పడంలేదు. వారు ఏదో ఒకచోట వేధింపులకు గురవుతున్నారు. వీరికి రక్షణగా నిలుస్తున్నాయి షీ టీమ్‌లు.. ఒక్క ఫోన్‌చేస్తే చాలు వెంటనే వాలిపోయి బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
తెలిసీ తెలియని వయసులో పెడదోవపడుతున్న యువకులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిపిస్తున్నాయి. షీ బృందాల ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటివరకు 488 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ప్రేమ వేధింపులే ఎక్కువ..
యువతులపై ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టేందుకు షీ టీమ్‌లను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. 2016లో మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, 2017లో 233 మందికి, 2018 నుంచి ఇప్పటివరకు 38 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తెచ్చారు.
పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు సామాజిక మాధ్యమాలు, ఫేస్‌బుక్, వాట్సాప్ పరిచయాల నేపథ్యంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రేమించాలంటూ యువకులు అమ్మాయిలపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో షీ టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి.
ప్రధాన ప్రాంతాల్లో నిఘా
ప్రధాన ప్రాంతాల్లోనే షీ బృందం నిఘా పెడుతోంది. జిల్లా కేంద్రంలోని జంగిడిపురం, చాణక్య పాఠశాల, బాలికల డిగ్రీ కళాశాల, బండారుబావి, బాలికల జూనియర్ కళాశాల, చందాపూర్ రోడ్డు, స్కాలర్స్, సీవీ రామన్ కళాశాల రోడ్డు తదితర కూడళ్లలో ఎక్కువమంది యువతి, యువకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి నుంచే షీ టీమ్‌కు ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఫోన్ వచ్చిన వెంటనే బృందాలు అక్కడి వెళ్లి విషయాలను ఆరా తీస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి.
సిబ్బందిని పెంచితేనే..
జిల్లాలో షీ టీమ్ ఏర్పాటైన మొదట్లో 8 మంది పనిచేశారు. ప్రస్తుతం నలుగురి పోలీసు సిబ్బంది మాత్రమే ఈ బృందంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరులో షీ టీమ్ సభ్యులు పనిచేయాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత కారణంగా జిల్లా కేంద్రంలో మాత్రమే షీ టీమ్ నిఘా ఉంచింది. దీంతో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సాధారణ దుస్తువుల్లో ఉండి విధులను నిర్వహించే షీ టీమ్‌కు సమాచారం అందించాలంటే 9177930150, 100 నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే సమస్య పరిష్కరానికి బృందం పనిచేస్తుంది. నిఘాతో పాటు బృందంలో మరింత మంది సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment