
దుర్గాభవాని, చిన్నారి కోసం గాలిస్తున్న దృశ్యం , నాగరాజు, భవాని (ఫైల్)
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: అత్తా కోడళ్ల తగాదాల నేపథ్యంలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కుటుంబ కలహాల కారణంగా అభంశుభం తెలియని పసి పాప బలైంది. పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన పరసా నాగరాజు కామవరపుకోటకు చెందిన దుర్గాభవానీతో ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి జ్యోత్స్న శ్రీనాగదుర్గా, షణ్ముక అనే ఇద్దరు పిల్లలు కలిగారు. గత కొంత కాలంగా అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో కొంతకాలం భీమడోలులో, మరి కొంతకాలం వేగివాడలో కాపురం నివసించారు. ఇదిలా ఉండగా నాలుగు నెలల కిందటే తిరిగి న్యాయంపల్లి వచ్చారు. అలా వచ్చిన నాటి నుంచి తిరిగి గొడవలు ఆ కుటుంబంలో పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత సోమవారం రాత్రి అత్తాకోడళ్లు తగవు పడ్డారు. దీనిపై తల్లి సత్యవతిని కుమారుడు నాగరాజు ప్రశ్నించాడు. ఈ గొడవలు ఇలాగే జరుగుతూనే ఉండాలా, ఇక ఆగవా అంటూ తల్లితో ఘర్షణ పడ్డాడు.
తిరిగి మంగళవారం సైతం తిరిగి ఘర్షణ జరగడంతో మేమంతా చనిపోతే గాని నీకు మనశ్శాంతి ఉండదనుకుంటూ అనుకున్నదే తడవుగా నాగరాజు భార్య దుర్గాభవానీ, కుమార్తెలు జ్యోత్స్నశ్రీనాగదుర్గ, షణ్ముకను తీసుకుని కొప్పులవారిగూడెం సమీపంలోని పోలవరం కుడికాలువ దగ్గరకు పరుగులు తీశాడు. భార్యా పిల్లలతో కలిసి, గోదావరి కాలువలో దూకి చనిపోతున్నామని ఆక్కడ నుంచి బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. ఆపై ఇద్దరు పిల్లలతో దుర్గాభవానీ గోదావరి కాలువలో దూకేసింది. ఇది చూసి నాగరాజు భయంతో అక్కడ నుంచి పారిపోయి కామవరపుకోటలోని అత్తింటికి వెళ్లాడని సమాచారం. ఇద్దరు పిల్లలతో తల్లి కాలువలో దూకుతున్న దృశ్యాన్ని కాలువ రెండో వైపు నుంచి చూసిన స్థానికులు మాదు రమేష్ సమీపంలో, అదే గ్రామానికి చెందిన యర్రా వెంకటేష్, భీమడోలు పోతురాజులను తీసుకుని అక్కడకు చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేసారు. అందులో ఒక చిన్నారి జ్యోత్స్న శ్రీనాగదుర్గను బయటకు తీయగా, తల్లి దుర్గాభవానీ(22) ఏడాదిన్నర వయస్సు ఉన్న రెండోపాప షణ్ముక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారికోసం ఏలూరు రూరల్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై వి.కాంతిప్రియ, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment