సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్.. ఇన్‌సెట్లో మృతి చెందిన అంజన్న
సాక్షి, జైపూర్(చెన్నూర్): అభం శుభం తెలియని పసివాడిని కన్నతల్లే కడతేర్చింది. అక్రమ సంబంధం కొనసాగించడానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ కసాయి తల్లి అమ్మతనాన్నే మరిచింది. పేగుపంచుకు పుట్టిన కుమారుడి గొంతు నులిమేసింది. మూడేళ్ల బాబును తిరిగిరాని లోకాలకు పంపింది. నూతన సంవత్సరం వేళ జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య–దీప అలీయాస్ దుర్గకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. శంకరయ్య గ్రామంలో పశువుల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి మూడేళ్ల కిందట ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కొద్దిరోజులకే మరణించారు. తదనంతరం..బాబు జన్మించాడు. అప్పటికే దీప మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. పుట్టిన బాబు అంజన్నను కూడా సక్రమంగా చూడకపోయేది. బంధువుల దగ్గర పెరిగిన అంజన్నకు మూడేళ్లు వచ్చాయి. పశువుల కాసేందుకు భర్త ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాడు. ఇక తన అక్రమ సంబంధం కొనసాగించడానికి ప్రధాన అడ్డంకిగా భావించిన కొడుకును అడ్డు తొలగించుకోవాలని భావించింది.
మంగళవారం ఉదయం శంకరయ్య రోజువారి పనిలో భాగంగా పశువులను తోలుకుని వెళ్లాడు. పాపం..ఆ పసివాడికి తెలియదు కన్నతల్లి ఇలా చేస్తుందని. రోజుమాదిరిగానే తల్లి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దీప కొడుకు గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేసి చంపివేసి మంచంలో పడుకోబెట్టింది. ఏం జరిగిందో తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తపడింది. అయితే చుట్టు పక్కలవారు, తండ్రి శంకరయ్య వెంటనే ఇంటి వద్దకు చేరుకొని చనిపోయిన పసివాడిని చూసి ఆవేదనవ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరాతీశారు. కాగా, తానే చంపినట్లు తల్లి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment