
ప్రతీకాత్మక చిత్రం
గత వారం రోజులుగా చైతన్య జాడ లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన వ్యక్తి ముఖం చాటేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్ బీ బ్లాక్‌లో ఉంటున్న నండూరి ఝాన్సీరాణి అలియాస్ మోనాలిసా సినీ నటి. ఇటీవల ఆమెకు వైజాగ్‌కు చెందిన చైతన్య అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కృష్ణానగర్‌లోనే సహజీవనం చేస్తున్నారు.
బాధితురాలి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గదిలోనే దేవుడి ఫొటో ముందు మంగళసూత్రం కట్టాడు. అయితే తనను బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకోవాలని ఆమె నిలదీయగా నిరాకరించాడు. గత వారం రోజులుగా అతడి జాడలేకపోగా ఈ నెల13న ఇంటికి వచ్చిన చైతన్య బంధువులు ఆమెను బెదిరించారు. పలుమార్లు చైతన్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.