దలైలామా
దొడ్డబళ్లాపురం: బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినట్టుగా కర్ణాటకలోని రామనగరలో పట్టుబడిన టెర్రరిస్టు వెల్లడించినట్టు తెలిసింది. గత ఆగస్టు 7న రామనగరకు వచ్చిన ఎన్‌ఐఏ బృందం జేఎంబీ టెర్రరిస్ట్ మునీర్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతడు అక్కడ పలు పేలుళ్లలో ప్రధాన నిందితుడు. పోలీసులు గాలిస్తుండడంతో భారత్‌లోకి చొరబడి బట్టల వ్యాపారిగా మారి బెంగళూరు, రామనగరలో మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై ఎన్‌ఐఏ నిఘా వేసి పట్టుకుంది. విచారణలో మునీర్ ఒక్కొక్కటీ బయటపెడుతుంటే దర్యాప్తు అధికారులే నివ్వెరపోతున్నారు.
దలైలామా తరచూ మైసూరు సమీపంలోని బైలుకుప్పె టిబెటన్ పునరావాస కేంద్రానికి వస్తుంటారు. ఆ సమయంలో హత్య చేయాలని రామనగరలో కుట్ర పన్నినట్లు మునీర్ వివరించాడు. దలైలామాను హత్య చేయడం ద్వారా భారత్ సహా పలు దేశాల్లో చిచ్చు పెట్టాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా అనుమానిస్తున్నారు. 2018 జనవరి 18న బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన కార్యక్రమంలో బాంబు పెట్టి దలైలామా, బిహార్ గవర్నర్ ఇద్దరినీ ఒకేసారి హత్య చేయాలని కుట్ర పన్నినట్లు మునీర్ బయటపెట్టాడు. ఈ కుట్రలో పాల్గొంటున్న ముగ్గురు అనుమానితులను ఎన్‌ఐఏ అరెస్టు చేయడంతో పథకం పారలేదు.
Comments
Please login to add a commentAdd a comment