
ముంబై : తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందనే కోపంతో.. గర్భవతి అని కూడా చూడకుండా కన్న కూతుర్ని చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం ముంబై ఘట్కోపార్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మీనాక్షి చౌరాసియా(20) అనే యువతి బ్రజేష్ చౌరాసియా అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే మీనాక్షి తండ్రి రాజ్ కుమార్ వీరి ప్రేమను అంగీకరించకపోవడమే కాక మీనాక్షికి వేరే సంబంధాలు చూడ్డం ప్రారంభించాడు. దాంతో మీనాక్షి, బ్రజేశ్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లి పోయి వివాహం చేసుకుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో.. కూతురుపై కోపం పెంచుకున్నాడు రాజ్ కుమార్.
ఈ క్రమంలో ప్రస్తుతం గర్భవతి అయిన మీనాక్షిని ఇంటికి వచ్చి కొత్త బట్టలు తీసుకెళ్లమని ఆహ్వానించాడు రాజ్ కుమార్. తండ్రి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన మీనాక్షిపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు రాజ్ కుమార్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మీనాక్షి భర్త ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ ఇంటికి చేరుకున్న పోలీసులకు రక్తపు మడుగులో ఉన్న మీనాక్షి మృత దేహం కనిపించింది. వెంటనే ఆ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మీనాక్షి తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. రాజ్ కుమార్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నది తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందనే కోపంతో తానే మీనాక్షిని చంపినట్లు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment