
సాక్షి, ముంబై : ప్రముఖ గ్యాంగ్‌స్టర్లకు, మోస్ట్ వాంటెడ్ నేరస్థులకు ఆశ్రయం కల్పించిన ముఠాకు సంబంధించిన వ్యక్తి మరణం ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. బాగా పాపులర్ అయిన గోల్డెన్ గ్యాంగ్‌కు చెందిన 32 ఏళ్ల గితేశ్ ఖోపడే సెవర్రి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై శవంగా కనిపించాడు.
గోల్డెన్ గ్యాంగ్ నాయకుడు చంద్రకాంత్ ఖోపబే అలియాస్ బబ్య ఖోపడే కొడుకే గితేశ్ ఖోపడే. ఓవైపు మిల్ కాంపౌండ్‌ను నిర్వహిస్తూనే తండ్రి ముఠాకి సాయం చేస్తుండేవాడన్న ఆరోపణలు గితేశ్‌పై వినిపించేవి. హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియర్ లాంటి ఫేమస్ డాన్‌లకు గోల్డెన్ గ్యాంగ్ రక్షణ కల్పించేదని అప్పట్లో చెప్పుకునే వారు. అలాంటి గ్యాంగ్ ప్రధాన నేత తనయుడు సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
అయితే తండ్రికి గితేశ్ ఎలాంటి సాయం చేశాడన్నదానిపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. గత కొంతకాలంగా అల్లర్లకు, గొడవలకు దూరంగా ఉంటున్న గితేశ్, లోవర్ పరేల్ ప్రాంతంలోని షాపుల మీద వచ్చే అద్దెతో జీవనాన్ని వెల్లదీస్తున్నాడు. గితేశ్‌ను ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.