సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో ముంబై మోడల్ కిడ్నాప్‌నకు గురైంది. ఇరువురి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలే దీనికి కారణం. ఈవెంట్‌లో పాల్గొనడానికని చెప్పి పిలిపించి నిర్బంధించారు. ఆపై ఆమెతోనూ బేరసారాలు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు వేట ముమ్మరం చేసి, ఇద్దరు నిందితుల్ని పట్టుకుని 2 రోజుల క్రితం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. కొసమెరుపు ఏమిటంటే.. ‘ఖాళీ బ్యాగ్’తో పోలీసులు రంగంలోకి దిగినట్లు గుర్తించిన నిందితులు మోడల్‌ను గుట్టుచప్పుడు కాకుండా ముంబై పంపించేశారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన సల్మాన్, మహ్మద్ స్నేహితులు. ఇరువురూ చేసిన ‘దందాల’నేపథ్యంలో సల్మాన్‌కు మహ్మద్ రూ.5 లక్షల వరకు బాకీ పడ్డాడు. దీని వసూలు సాధ్యం కాకపోవడంతో సల్మాన్.. కిడ్నాప్‌నకు పథక రచన చేశాడు.
స్నేహితుడితోనే యువతిని రప్పించి...
ముంబైలోనూ పరిచయాలున్న మహ్మద్ అక్కడ నుంచి యువతుల్ని ఈవెంట్స్‌లో పాల్గొనడానికి రప్పించేవాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఓ ఈవెంట్ ఉందని, మోడల్‌ను సమకూర్చమని మహ్మద్‌ను కోరాడు. దీంతో మహ్మద్.. పూజ అనే మోడల్‌ని వారం రోజుల క్రితం సిటీకి రప్పించాడు. ఈమెకు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన సల్మాన్ తనకు అల్లుడి వరుసయ్యే షబ్బీర్‌తో కలసి పాతబస్తీలో నిర్బంధించాడు. తనకు రావాల్సిన రూ.5 లక్షలు ఇవ్వకపోతే పూజను చంపేస్తానంటూ మహ్మద్‌కు సమాచారం ఇచ్చాడు. అలాగే కిడ్నాప్ విషయాన్ని ముంబైలో పూజను పంపిన దళారికి తెలియజేయడంతో అతను మహ్మద్‌పై ఒత్తిడి పెంచాడు. ఓ దశలో పూజకు అసలు విషయం చెప్పి తనకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తానంటూ సల్మాన్ ఒప్పందం చేసుకున్నాడు. పూజను తాళ్లతో బంధించినట్లు కొన్ని ఫొటోలు తీసి వాటిని వాట్సాప్ ద్వారా మహ్మద్‌తో పాటు ముంబైలోని దళారికీ పంపాడు.
స్థానిక పోలీసులకు చిక్కకపోవడంతో...
దళారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో మహ్మద్ కిడ్నాప్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహ్మద్‌తో కలసి ఓ వ్యూహం పన్నారు. రూ.5 లక్షల్ని ఇస్తానంటూ సల్మాన్‌ను రప్పించడానికి ప్రయత్నించారు. డబ్బు బ్యాగ్‌ను మలక్‌పేటలో ఓ చోట విడిచి వెళ్లాల్సిందిగా మహ్మద్‌కు సల్మాన్ సూచించాడు. ఖాళీ బ్యాగ్‌ను అక్కడ పెట్టి, తీసుకోవడానికి వచ్చిన సల్మాన్‌ను పట్టుకోవాలని పోలీసులు ఆ రహదారిలో కాపుకాశారు. అయితే వేరే సందు నుంచి వచ్చిన సల్మాన్, షబ్బీర్ బ్యాగ్‌తో ఉడాయించారు.
ఖాళీ బ్యాగ్ ఉండటంతో అనుమానించి...
ఖాళీ బ్యాగ్ చూసి పూజ ప్రాణాలకు హాని చేసే ప్రమాదం ఉండటంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సల్మాన్, షబ్బీర్‌ల ఆచూకీ కనిపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పూజ అక్కడ లేకపోవడంతో ఇద్దరినీ వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఖాళీ బ్యాగ్ పెట్టినప్పుడే అనుమానం వచ్చిందని, దీని వెనుక పోలీసులు ఉన్నారని భావించి భయంతో వెంటనే పూజను బస్సులో ముంబై పంపేశానని సల్మాన్ చెప్పాడు. పూజ అక్కడ భద్రంగా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం సల్మాన్, షబ్బీర్‌లను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. 2రోజుల క్రితం వీరిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment