కర్నూలు (టౌన్): ఇరవై ఏళ్లుగా నమ్మకంగా ఇంట్లో పనిచేస్తున్న పాలేరును బీమా సొమ్ము కోసం ఇంటి యజమాని, మరికొందరు కలసి హతమార్చిన ఘటనలో నిందితులను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన టీడీపీ మద్దతుదారుడు సీజే భాస్కర్‌రెడ్డి ఇంట్లో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన వడ్డే సుబ్బరాయుడు పాలేరుగా పనిచేస్తుండేవాడు. ఇతను దివ్యాంగుడు. పైగా అనాథ. దీంతో అతని ప్రాణాలను ఫణంగా పెట్టి డబ్బు సంపాదించాలని భాస్కర్‌రెడ్డికి దుర్భుద్ధి పుట్టింది. నంద్యాలకు చెందిన న్యాయవాది మహేశ్వరరెడ్డి, అవుకు గ్రామానికి చెందిన షేక్షావలి, హోటల్ రమణ అనే వ్యక్తులతో కలసి పథకం రచించారు.
2015 నవంబర్‌లో హైదరాబాదుకు చెందిన న్యూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు మల్లేష్, శర్మలను సంప్రదించి సుబ్బరాయుడు పేరు మీద రూ. లక్షకు ఒక పాలసీ, రూ. 15 లక్షలకు మరొక పాలసీ చేయించారు. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే డబుల్ పరిహారం లభించే పాలసీలివి. ఆ తర్వాత భాస్కరరెడ్డి 2015 డిసెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున పొలానికి వెళ్దామంటూ సుబ్బరాయుడును తీసుకెళ్లి మార్గమధ్యంలో మరికొందరితో కలసి గొంతు నులిమి చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా సుబ్బరాయుడు తలపై ట్రాక్టర్‌ను ఎక్కించి ప్రమాదంగా చిత్రీకరించారు.
ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి.. ‘వడ్డే భాస్కర్’గా బోగస్ ఓటర్ కార్డు పొందాడు. సుబ్బరాయుడు తన తమ్ముడని, నామినీగా ఉన్నానంటూ బీమా కంపెనీ ప్రతినిధులను నమ్మించి.. రూ. 32 లక్షల పరిహారాన్ని కాజేశాడు. ఈ డబ్బును నిందితులందరూ పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఇటీవల ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి రావడంతో సీసీఎస్ పోలీసులతో దర్యాప్తు చేయించారు. ప్రధాన నిందితుడు భాస్కరరెడ్డి నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు హత్యకు సహకరించిన షేక్షావలి, జీనుగ వెంకటకృష్ణ, జీనుగ శివశంకర్‌ను శనివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. హత్యలో పాత్ర ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి, హోటల్ రమణ, లాయర్ మహేశ్వర్‌రెడ్డితో పాటు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మల్లేష్, శర్మ పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఇన్సూరెన్స్ డబ్బు కోసం పాలేరు హత్య
Published Mon, Aug 26 2019 5:12 AM | Last Updated on Mon, Aug 26 2019 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment