వామి దొడ్డిలో హత్యకు గురైన అక్కంగారి పెద్ద వన్నప్ప (ఇన్‌సెట్) పెద్ద వన్నప్ప (ఫైల్)
విడపనకల్లు : పాల్తూరులో దారుణం జరిగింది. అబ్బాయి చేతిలో బాబాయి హత్యకు గురయ్యాడు. టైరుబండిపై నిద్రిస్తుండగా కర్రతో బలంగా బాది కడతేర్చాడు. అనంతరం కర్ణాటకకు పారిపోతుండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విడపనకల్లు పాల్తూరులో అక్కంగారి పెద్ద వన్నప్ప (55) హత్యకు గురయ్యాడు. ఇంటి రస్తా వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 2013లో ఇంటి రస్తా విషయమై పెద్ద వన్నప్పతో తమ్ముడి కుమారుడైన వన్నూరుస్వామి అలియాస్ సుస్తిగాడు గొడవపడ్డాడు. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇదే విషయమై తగాదాలు జరుగుతుండేవి.
పథకం ప్రకారమే..
వన్నూరుస్వామి పచ్చి తాగుబోతు. రస్తా వివాదం లేకుండా చేసుకోవాలంటే చిన్నాన్నను అడ్డు తొలగించుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. శనివారం తెల్లవారుజాము సమయంలో కొత్తపోలీస్‌స్టేషన్ దగ్గర గల వాముదొడ్డిలో టైరుబండిపై పడుకుని ఉన్న పెద్దవన్నప్పపై బండి గూటము(కట్టె)తో దాడిచేశాడు. తలపై బలమైన దెబ్బ తగలడంతో పెద్దవన్నప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని గంటల తర్వాత అటువైపు వచ్చిన వారు గమనించి మృతుడి భార్య, కుమారులకు సమాచారమందించారు.
రంగంలోకి డాగ్ స్క్వాడ్ :
అనంతపురం నుంచి ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ వెన్నీల ఆధ్వర్యంలో డాగ్ స్క్వాగ్ బృందంతో పరిశీలించారు. హత్య చేసిన నేరస్తుడి ఇంటి వద్ద పోలీసు జాగిలాలు ఆగిపోయాయి. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ చిన్న గౌస్, పాల్తూరు, ఉరవకొండ ఎస్‌ఐలు ఖాన్, జనార్దన్‌నాయుడు పరిశీలించారు. హత్యకు కారణమైన ఆయుధం (కట్టె)ను కూడా పరిశీలించారు.
పోలీసుల అదుపులో నిందితుడిని
నిందితుడు కర్ణాటక వైపు వెళుతున్నాడన్న సమాచారం అందడంతో సీఐ చిన్నగౌస్ తన సిబ్బందితో వెళ్లి హావళిగి వద్ద వన్నూరుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నాన్నను తానే హత్య చేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment