వాట్సాప్ వైరల్ అవుతున్న వీడియోలోని ఓ దృశ్యం
లక్నో: వేరే మతానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంతో ఓ యువకుడిని చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. వెంబడించి మరీ ఆ యువతి ముందే అతనిపై దాడి చేశారు. ‘మా మతానికి చెందిన అమ్మాయితో నీకేంట్రా పని?’ అంటూ పిడిగుద్దులు గుప్పించారు. ఆపై ఆ దాడిని చిత్రీకరించి వాట్సాప్‌లో రాత్రికి రాత్రే వైరల్ చేశారు. కాన్పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...
ఇస్లాం మతానికి చెందిన యువకుడు ఆ యువతికి మధ్య మూడేళ్ల స్నేహం ఉంది. శుక్రవారం ఆమె ఊరెళ్తుండటంతో స్టేషన్‌కి వెళ్లి ఆమెను కలిశాడా యువకుడు. అయితే అతనికి తెలీకుండా అనుసరించిన కొందరు వ్యక్తులు.. అక్కడికక్కడే ఆ యువకుడిని దొరకబుచ్చుకుని దాడి చేశారు. మీ మధ్య సంబంధం ఏంటని? ఆ యువతిని వాళ్లు నిలదీయగా.. మధ్యలో జోక్యం చేసుకుని ఆ ముస్లిం యువకుడు చెప్పిన సమాధానం వారిలో మరింత ఆగ్రహం తెప్పించింది.
‘నిన్ను ఇవాళ చంపకపోతే మా పేరు మార్చుకుంటాం’ అంటూ వారు అతనిపై విరుచుకుపడ్డారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు స్థానికంగా వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. ‘తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, చెప్పేది వినకుండా తనపై దాడి చేశారని’ బాధిత యువకుడు వాపోతున్నాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాన్పూర్ పోలీసులు నిందితులను హిందూ అతివాద సంస్థకు చెందిన సభ్యులుగా గుర్తించి, వారి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment