
నవీన్ దంపతులు(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.బి కాలనీకి చెందిన నవీన్ (24) అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించి ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే కలిసున్న వీరిద్దరూ గతకొన్ని రోజులుగా ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఇద్దరం కలిసుందాము రమ్మంటూ నవీన్ అనేకసార్లు భార్యతో చెప్పినా ఆమె వినలేదు.
భార్య తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉండటం, ఎంత బతిమలాడిన వినకపోవడంతో నవీన్ మనస్తాపానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని నిన్న రాత్రి తల్లితో చెప్పి బాధపడి రూములోకి పోయి పడుకున్నాడు. ఉదయం తలుపు ఎంతకీ తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా నవీన్ ఉరి వేసుకుని కనిపించాడు. విగతజీవిగా వేలాడుతున్న కొడుకుని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే ఈ విషయంపై నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కొడుకు నవీన్ చావుకు తన కోడలు పరోక్షంగా కారణం అని అతని తల్లి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment