
నిందితుడు ఆంజనేయులు,హెప్సిబారాణి (ఫైల్)
తణుకు: తల్లిదండ్రులు లేని ఒంటరి జీవితం.. అయినా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం.. విద్యార్థి దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అనాథగా మిగలకూడదని ఒక పాస్టర్ ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆమె కలలను నిజం చేయాలని భావించి ఆమెను నర్సింగ్ కోర్సు చదివిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒక వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ప్రేమ పేరుతో వంచించాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మబలికాడు. చివరికి పెళ్లి విషయం తీసుకువస్తే తనకు అప్పటికే పెళ్లయ్యిందనే విషయాన్ని చెప్పాడు. దీనిని జీర్ణించుకోలేని ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (21) తణుకులోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హెప్సిబారాణి ఆత్మహత్యకు కారణమైన ఆమె ప్రియుడు పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని పోలీసులు అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు నర్సింగ్ కళాశాల వసతి గృహంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి తోటి విద్యార్థులను విచారించారు.
మత్తు ఇంజెక్షన్ చేసుకుని..
అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి రామారావు, కుమారి దంపతుల కుమార్తె హెప్సిబారాణి. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో ఆమె అనాథగా మిగిలింది. కుటుంబ సభ్యుల నిరాదరణ కారణంగా పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పాస్టర్ ఒకరు ఆమెను చేరదీసి తణుకులో నర్సింగ్ కోర్సు చదిస్తున్నారు. జీఎన్‌ఎం ఆఖరి సంవత్సరం చదువుతూ ఇటీవల పరీక్షలు సైతం రాసింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడింది. నర్సింగ్ కోర్సు చదువుతున్న హెప్సిబారాణి తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు అంజితో కొంతకాలంగా ఘర్షణ పడుతోంది. తనకు ఇంతకుముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన అంజి వ్యవహారంపై స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలు స్తోంది.
హాస్టల్‌లో సహచర విద్యార్థినులను విచారిస్తున్న సీఐ రాంబాబు
అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటుండగా నాలుగు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని ఇంజెక్షన్ చేయాలని స్నేహితులను కోరింది. అయితే ఆమె తీసుకువచ్చిన ఇంజెక్షన్ అనుమానాస్పదంగా ఉండటంతో వారు నిరాకరించారు. దీంతో స్వయంగా హెప్సిబా రాణి తానే ఇంజెక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు. రోగులకు ఆపరేషన్లు చేసే సమయంలో ఇచ్చే మత్తు ఇంజెక్షన్ నరానికి చేసుకోవడం వల్ల ఆమె మృతి చెందినట్టు పోలీసులు, వైద్యులు ప్రాథమిక విచారణలో తేల్చా రు. మృతదేహానికి పోలీసులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
పరువు కోసం ప్రాణం తీసుకుని..
‘నన్ను పెంచి పోషిస్తున్న పాస్టర్ గారి పరువు కోసమే చనిపోతున్నాను.. నేను ఎన్నో కలలు కన్నాను.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని.. అయితే నా కలలన్నీ కల్లలు చేశావు..’ అంటూ తన ప్రియుడు అంజిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ గుండెల్ని కదిలిం చింది. మృతురాలు హెప్సిబారాణి తాను చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు ముందుగా పిండి ఆంజనేయులు అలియాస్ అంజిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘కేవలం నీవల్లే నా జీవితం ఇలా అయిందనీ.. నేను నిన్ను ప్రేమించి జీవితంలో పెద్ద తప్పు చేశానని.. ఇకపై ఎవరినీ ఇలా మోసం చేయవద్దని’ సూసైడ్‌నోట్‌లో ఆమె పేర్కొంది. ‘నాలాంటి అనాథలను ఉన్నత స్థానం కల్పించి ప్రేమగా ఆదరిస్తున్న పాస్టర్‌కు ఐ లవ్యూ’ అంటూ ప్రేమను వ్యక్తపరిచింది. తనలా ఎవరూ మోసపోవద్దని తన స్నేహితులకు ఆమె సలహా ఇచ్చి తనువు చాలించింది.
Comments
Please login to add a commentAdd a comment