
సాక్షి, శంషాబాద్: ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మద్యం మత్తులో ఉన్న యువకులు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆటో డ్రైవర్‌ను చితకబాదిన ఘటనలో ఆర్‌జీఐఏ పోలీసులు పాతబస్తీకి చెందిన 11 మందిని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఆర్‌జీఐఏ ఠాణాలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ వట్టెపల్లి ప్రాంతానికి చెందిన చిరువ్యాపారి పర్వేజ్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా శంషాబాద్–మామిడిపల్లి రహదారిలో హసీబుద్దీన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో వేడుకలకు ఏర్పాటు చేశాడు. పర్వేజ్‌తో పాటు మహ్మద్ రహమాన్, ముక్రముద్దీన్, సయ్యద్ బుర్హాన్, సయ్యద్ నసీర్ పాషా, మహ్మద్‌జుబేరుద్దీన్, సోహెల్‌షాఖాన్, కరీముద్దీన్, షహబాజ్ అలీ, ఇమ్రాన్, సయ్యద్ అస్గర్ అహ్మద్, సల్మాన్, అస్లాం పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళా డ్యాన్సర్లను మొఘల్‌పురా నుంచి రాత్రి 10 గంటలకు ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు.
మద్యం మత్తులో జోగుతున్న వీరు హుక్కాను కూడా సేవించారు. వీరిలో కొందరు డ్యాన్సర్లతో అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన డ్యాన్సర్లు ఆటోడ్రైవర్ అజ్జు సహకారంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సదరు యువకులు వారిని వెంబడించి ఆటోను అటకాయించి డ్రైవర్‌పై దాడి చేశారు. గస్తీలో ఉన్న పహాడీషరీఫ్ పోలీసులు దీనిని గమనించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత యువతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్నోవా కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని 11 మందిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఆర్‌జీఐఏ సీఐ మహేష్, అడ్మిన్ ఎస్‌ఐ రమేష్‌నాయక్ పాల్గొన్నారు.