ఇసుక మాఫియా హత్యలు! | Over 110 people died in four years with Sand Mafia in the state | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియా హత్యలు!

Published Sat, Jul 14 2018 3:10 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Over 110 people died in four years with Sand Mafia in the state - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక మాఫియా ధనదాహం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తూ వేగంగా వెళ్లే వాహనాల కింద నిండు జీవితాలు నలిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీ నాయకులే ఇసుక దందాలో కీలక సూత్రధారులుగా ఉండటంతో బాధిత కుటుంబాలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ విప్‌ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి తెగబడటం తెలిసిందే. ఇదే తరహాలో పలుచోట్ల అధికారులు, ప్రజలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇసుక దందాపై నిలదీసిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు.

విచ్చలవిడిగా తవ్వకాలు: ఇసుక మాఫియా ధనదాహం వందల ప్రాణాలను కబళిస్తున్నా సర్కారులో చలనం లేదు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఏరులు, కాలువల్లో యథేచ్చగా సాగుతున్న తవ్వకాలు, అక్రమ రవాణా జనం ప్రాణాలపైకి వస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 11 మందికిపైగా మృతి చెందగా చిత్తూరు జిల్లాలో ఇసుక దిబ్బలు పడి ఏడుగురు, ఇసుక లారీ ఢీకొని 16 మంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 13 మందికిగాపైగా ఇసుక మాఫియాకు బలయ్యారు.

ఇసుక దిబ్బల్లో ఏడుగురు సజీవ సమాధి: చిత్తూరు జిల్లాలో భిన్నమైన పరిస్థితిలో ఇసుక మరణాలు సంభవించాయి. ఇసుక దిబ్బల కింద పడి నాలుగేళ్లలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణిల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. నాణ్యమైన ఇసుక కోసం సొరంగం మాదిరిగా భూగర్భంలో తవ్వుతుండగా ఒక్కసారిగా దిబ్బలు విరిగి కూలీల మీద పడటంతో చనిపోతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి, పుంగనూరు నియోజకవర్గం చెదళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. 

తవ్వకాలు ఆపమంటే.. లారీ తొక్కేసింది
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత ఏడాది ఏప్రిల్‌ 21న జరిగిన ఘటన కలకలం సృష్టించింది. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ మునగపాళ్యం రైతులు ఏర్పేడు తహశీల్దార్‌ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. తహశీల్దార్‌ లేకపోవడంతో తిరుపతి అర్బన్‌ ఎస్పీని కలిసేందుకు ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో ఓ లారీ హఠాత్తుగా రైతులపైకి దూసుకురావటంతో 16 మంది మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

గాల్లో కలిసిన ప్రాణాలెన్నో...
- శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ పరిధి సింహద్వారం సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 28న తమ్మినాయుడుపేట రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో బోనం కాంతమ్మ అనే మహిళ మరణించింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం మకరాంపురం కూడలి వద్ద ఈ ఏడాది జూన్‌ 14న ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనటంతో ఒడిశా గజపతి జిల్లా లింగుపురం గ్రామానికి చెందిన లోళ్ల మధుసూదనరావు మృతి చెందాడు. ప్రమాదంలో ఆయన సోదరుడు రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిధిలోని బెల్లుపడ వద్ద గతేడాది మార్చి 25న ఇసుక ట్రాక్టర్‌ కింద పడి ఆసి హైమ (38) మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇసుక తరలిస్తున్న వాహనం ఢీకొని మల్లయ్యపేటకు చెందిన బొబ్బిలి చంద్రశేఖర్‌ (13) అక్కడికక్కడే మృతి చెందగా గొల్లవీధికి చెందిన పిల్లల రాజేంద్ర తీవ్ర గాయాల పాలయ్యాడు. 
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గుటాల ఇసుక ర్యాంపు వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఇసుక లారీ ఢీకొట్టడంతో పాతపట్టిసీమ గ్రామానికి చెందిన కాకి గోపాలకృష్ణ (42) దుర్మరణం పాలయ్యాడు.
వైఎస్సార్‌ జిల్లాలో ఇసుక ట్రాక్టర్ల కింద పడి ముగ్గురు మరణించారు. 2017 మార్చి 5న గోపిరెడ్డి రమేష్‌రెడ్డి (23), 2017 జూన్‌ 30న సి.మురళీకుమార్‌ (33),  2018 ఫిబ్రవరి 6న కనిమెల జయమ్మ అక్రమ ఇసుక తరలిస్తున్న వాహనాలకు బలయ్యారు.
కర్నూలు జిల్లాలో గత రెండేళ్లలో నలుగురు చనిపోయారు. 2017 జూలై 27న రెండేళ్ల చిన్నారి నాని, మద్దిలేటి (30) ఇసుక వాహనాలు ఢీకొనటంతో చనిపోయారు. ఈ ఏడాది జూన్‌ 27న మధు(22), మనోహర్‌(20)లు దుర్మరణం పాలయ్యారు. 

‘తూర్పు’న అత్యధిక ప్రమాదాలు..
తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక ప్రమాదాలు అత్య«ధికంగా జరిగాయి. వేగంగా వచ్చిన వాహనాలు ఢీకొనడంతో గత నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా 12 మందికిపైగా మరణించారు.
2018 మే 26న తునిలోని ఇసుకలపేటలో విద్యార్థిని చలికే ఎస్తేరురాణి(10) ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో మృతి చెందింది. 
2018 జనవరి 9న కోరుమిల్లి ఇసుక ర్యాంపులో పనిచేసే సలాది సత్తిబాబు లారీ తగలటంతో మరణించాడు. 
2017 నవంబరు 18న తాతపూడి శివారు గోపాలరావుపేట వద్ద గోదావరి గట్టుపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వీరా జయబాబు (26)ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
2017 నవంబర్‌ 11 సీతానగరం వద్ద వంగలపూడి ర్యాంపు నుంచి వచ్చే ఇసుక లారీ ఢీకొని  నాలుగేళ్ల చిన్నారి పేపకాయల మోహన్‌ శివసాయి మృతి చెందాడు.
2017 ఆగస్టు 20న సీతానగరానికి చెందిన ఈలి భాస్కరరావు (65) రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌కు బలయ్యాడు. 
- 2017 జూన్‌ 7న కపిలేశ్వరపురం మండలం చినకోరుమిల్లికి చెందిన గంగుమళ్ల సూర్యచంద్రరావు (51) రాత్రి వేళ లంక పొలం నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఇసుక వాహనం ఢీకొని మత్యువాత పడ్డాడు. 
2017 మార్చి 1న రఘుదేవపురంలో ఇసుక లారీ ఢీకొనడంతో పన్నెండేళ్ల నందిపాటి నవీన్‌కుమార్‌కు కుడి కాలు తొలగించారు. 
గతేడాది ఇసుక వాహనం ఢీకొన్న ఘటనలో కడియం నర్సరీలో పనిచేసేందుకు వెళుతున్న కపిలేశ్వరపురం సత్యనారాయణపురానికి చెందిన 14 మందికి కూలీలకు గాయాలయ్యాయి. 
2016 జూన్‌ 15న కాటవరం ర్యాంపు నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొనడంతో మునికూడలి పంచాయతీ రాజంపేటకు చెందిన మామిడి దుర్గ (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
2015 మే 25న అచ్యుతాపురం వద్ద ఇసుక లారీ ఢీకొట్టడంతో వల్లూరుకు చెందిన పాలచర్ల సత్యనారాయణ చనిపోయాడు.
2014 మార్చి 20న కపిలేశ్వరపురంలో ఇసుక ట్రాక్టరు ఢీకొనడంతో టేకికి చెందిన మేడిశెట్టి చంద్రావతి దుర్మరణం పాలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement