
భార్యతో కృష్ణ మాంచి
పట్నా: లేడనుకున్న మనిషి.. ఇక రాలేడుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. చనిపోయి అంత్యక్రియలు కూడా నిర్వహించిన వ్యక్తి ఒక్కసారిగా మన ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది. ఊహించడానికి కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. మూక దాడుల్లో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన మూడు నెలల తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నాడు. వివరాలు.. పట్నాలోని నిసార్‌పూర్ గ్రామానికి చెందిన కృష్ణ మాంచి అనే వ్యక్తి ఈ ఏడాదిలో ఆగస్ట్‌లో కనిపించకుండా పోయాడు. అదే నెల 10న బిహార్ మమత్పూర్ గ్రామంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే నెపంతో ఆ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి చంపారు. అయితే మృతదేహం గుర్తుపట్టకుండా ఉండటంతో దుస్తుల ఆధారంగా అతను కృష్ణ మాంచి అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం వారు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
మూడు నెలల తరువాత..
అయితే దాదాపు మూడు నెలల తర్వాత కృష్ణ మాంచి తిరిగి ఇంటికివచ్చాడు. అతన్ని చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఇక లేడు అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆనందంతో చిందులేశారు. ‘నేను మృతదేహాన్ని సరిగ్గా గుర్తించలేదు. దుస్తుల ఆధారంగా అతను నా భర్తే అని గ్రామస్తులు చెప్పడంతో నమ్మెశాను. ఇక లేడు అనుకున్న నా భర్త తిరిగిరావడం సంతోషంగా ఉంది’ అని కృష్ణ భార్య రూడీదేవి మీడియాకు తెలిపారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరు అనే దానిపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.