
సాక్షి, నాగోలు: కూలిపని ఉందంటూ ఓ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి అమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు, అతడికి సహకరించిన నిందితుడి భార్యను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, బైక్‌తో పాటు, హత్యకు ఉపయోగించిన సుత్తి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్‌ప్రిత్‌సింగ్ వివరాలు వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా, యారరం గ్రామానికి చెందిన చెట్ల లింగమ్మ(50) నగరానికి వలసవచ్చి సోమాజిగుడలోని ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కందూరి రమేష్, తన భార్య సుజాతతో కలిసి ఖైరతాబాద్ బీజేఆర్‌లో ఉంటూ నాగోలులోని మార్బుల్స్, టైల్స్ షాపుల్లో కూలి పని చేసేవాడు.
అతడి భార్య సుజాత పంజగుట్టలోని ఓ ఆసుపత్రిలో స్వీపర్‌గా పని చేసేది. మక్తాలోని లేబర్ అడ్డాలో లింగమ్మతో రమేష్‌కు పరిచయం ఏర్పడటంతో గతంలో రెండు మూడు సార్లు మార్బుల్ షాపుల్లో పని నిమిత్తం నాగోలు ప్రాంతానికి తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జల్సాలకు అలవాటు పడిన రమేష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికితోడు రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కన్ను లింగమ్మ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అమెను హత్య చేసి వాటిని సొంతం చేసుకోవాలని భావించిన రమేష్ అందుకు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 11న లింగమ్మ కూలీ పని కోసం రమేష్‌కు ఫోన్ చేయగా నాగోల్ ప్రాంతంలో పని ఉందని, రాజ్‌భవన్ రోడ్డులోని రైల్వే క్రాసింగ్ వద్దకు రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి చేరుకుంది.
లింగమ్మ అక్కడికి రాగానే బైక్‌పై ఆమెను నాగోలు ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. రాత్రి ఇద్దరూ కలిసి సమీపంలోని కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో లింగమ్మను నాగోలు నుంచి కుంట్లూరు వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లిన రమేష్ సుత్తితో తలపై మోదడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం కటింగ్ ప్లేయర్‌తో చెవి దిద్దులు, ముక్కు పుడక, కాళ్ల కడియాలు కట్ చేసి తీసుకుకెళ్లాడు. అనంతరం ఇంటికి వెళ్లిన రమేష్ హత్య విషయాన్ని తన భార్య సుజాతకు చెప్పాడు. ఈ నెల 12న ఇద్దరూ కలిసి లింగమ్మ వద్ద దోచుకున్న కాళ్ల కడియాలను విశాల్‌జైన్ అనే పాన్ బ్రోకర్ వద్ద రూ. 11 వేలకు తాకట్టు పెట్టారు. కాగా ఈ నెల 12న కుంట్లూరు గ్రామానికి చెందిన నరేష్‌రెడ్డి అనే వ్యక్తి మహిళ హత్యకు గురైన విషయాన్ని గుర్తించి హయత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు అందులో దొరికిన క్లూ ఆధారంగా బుధవారం రాజ్‌భవన్ రోడ్డులో రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. చోరీ సొత్తును విక్రయించడంలో అతడికి సహకరించిన సుజాతను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ ఎస్.జయరామ్, హయత్‌నగర్ సీఐ సతీష్, డీఐ సి.హెచ్ శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment