ప్రేమ జంటను బెదిరించి.. | Police Officials Corruption in Guntur | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో వసూల్‌ రాజాలు

Published Sat, Dec 28 2019 1:28 PM | Last Updated on Sat, Dec 28 2019 1:28 PM

Police Officials Corruption in Guntur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో ప్రేమ జంటను బెదిరించి రూ. 35 వేల వసూలు

సాక్షి, గుంటూరు: జిల్లాలో కొంత   మంది పోలీసు అధికారులు, సిబ్బంది కట్టుతప్పుతున్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కిన బాధితుల వద్ద లంచాలు వసూలు చేస్తున్నారు. గుంటూరు అర్బన్‌ జిల్లాలోని ఓ పోలీసుస్టేషన్‌ సిబ్బంది అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రేమ జంటను బెదిరించి..
గత నెలలో సదరు పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు ఓ పార్క్‌లో ఉన్న ప్రేమ జంటను బెదిరించారు. స్పాట్‌లో యువతి నుంచి రూ.1500 తీసుకుని పంపించారు. అనంతరం యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపుతామని బెదిరించి రూ.35 వేలకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న స్టేషన్‌ బాస్‌ ముగ్గురు కానిస్టేబుళ్లను స్టేషన్‌ విధుల నుంచి తొలగించి బ్లూకోట్స్‌ విధులకు అటాచ్‌ చేసినట్లు తెలిసింది. అయితే వీరు బ్లూకోడ్స్‌ విధులను పక్కన బెట్టి స్టేషన్‌ పరిధిలో ఎక్కడెక్కడ పేకాట, వ్యభిచారం, కోడి పందేలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో పరిశీలిస్తున్నారు. అక్కడకు వెళ్లి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలువస్తున్నాయి. క్రిస్మస్‌ పండగ రోజు రాత్రి గుంటూరు నగర శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి, ఎనిమిది మంది పేకాట రాయుళ్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న సదరు కానిస్టేబుళ్లు రూ. 30 వేలు వసూలు చేసి వారిని వదిలి పెట్టినట్లు సమాచారం.

స్టేషన్‌ బాస్‌ వ్యవహారమూ అంతే..  
అర్బన్‌ జిల్లాలోనే అతి పెద్ద సర్కిల్‌ ఉన్న సదరు పోలీసుస్టేషన్‌ బాస్‌ తీరుపైనా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్‌లోనే సివిల్, ఇతర సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ అడ్డగోలుగా లంచాలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీఐపై ఏసీబీకి సైతం ఫిర్యాదులు అందాయి. మూడు నెలల క్రితం ఏసీబీ ట్రాప్‌ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడనే ప్రచారం పోలీసు శాఖలో ఉంది. ఇటీవల ఓ ఎన్‌ఆర్‌ఐ స్థలాన్ని అతని ప్రమేయం లేకుండానే ఇద్దరు వ్యక్తులు అమ్మేశారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఆర్‌ఐ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే స్థలం అమ్మిన ఇద్దరిలో ఒక వ్యక్తిని వదిలిపెట్టి ఒకరిపై మాత్రమే బాస్‌ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల నమోదైన ఓ గంజాయి విక్రయాల కేసులో సైతం భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఈ సర్కిల్‌ పరిధిలో జాతీయ రహదారి వెంబడి మిర్చి, పొగాకు, పత్తి గోడౌన్లలో గుట్కా స్థావరాలు, ఎనిమిది నుంచి పది చోట్ల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వీటి నుంచి బాస్‌కు నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్‌లో పని చేస్తున్న ఆ ముగ్గురు కానిస్టేబుళ్లే నెలవారీ మామూళ్లు వసూలు చేసి పెడుతుంటారని తెలుస్తోంది. పోలీస్‌ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement