లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసకు పాల్పడిన వ్యక్తుల ఫోటోలను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం విడుదల చేశారు. మవు జిల్లాలో నిందితుల పోస్టర్లతో పాటు వారిపై రివార్డు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితుల ఆచూకీ తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల ఫోటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన హింసలో దాదాపు 17 మంది చనిపోయారని, 213 కేసులలో 925 మందిని అరెస్ట్ చేశామని యూపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. మవు జిల్లాలో సోమవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 110 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వీడియోలు, ఫోటోలన్నీ సీసీ కెమెరాలు, మీడియా నుంచి సేకరించామని పోలీసులు తెలిపారు.
మవు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన అంశంలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశామని, 21 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాన్పూర్ పోలీసులు శుక్ర, శనివారాలలో హింసకు పాల్పడిన 48 మంది నిందితులతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. వీరిపై 17 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ఫిరోజాబాద్‌లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 80 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. బిజ్నూర్‌లో ముగ్గురు నిందితులపై 25వేల రివార్డు ప్రకటించగా, అల్లర్లలో ఇద్దరు చనిపోయారు. 146 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్పీ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ.. విచారణలో మాజీ మున్సిపల్ చైర్మన్ జావేద్ అఫ్తాబ్, డా. ఫుర్ఖాన్ మెహర్బాన్, ఆదిల్‌లను గుర్తించాము. ఈ ముగ్గురిపై 25వేల రూపాయల రివార్డు ప్రకటించాము. ఈ ముగ్గురూ ప్రసుతం పరారీలో ఉన్నారు. డా. ఫుర్ఖాన్ బిజ్నూర్‌లో ఓ మదర్సా కూడా నడుపుతున్నాడని వివరించారు.
గోరఖ్‌పూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 60 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. 33 మంది ఆస్తులను అటాచ్ చేస్తూ వారి ఇంటి గోడలపై నోటీసులు అంటించారు. ఈ విషయంపై పోలీస్ అధికారి జయదీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ఆ నోటీసులలో నిందితులు రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాం. అంతేకాకుండా అల్లర్లలో విధ్వంసానికి పాల్పడలేదని వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతున్నామని వెల్లడించారు.
మరోవైపు నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు న్యాయవాది సరీం నవేద్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారమే వ్యవహరిస్తున్నారు. అయితే మైనర్ల విషయంలో చట్టాలు వేరేలా ఉంటాయి. నిబంధనల ప్రకారం మైనర్ల ఫోటోలను బహిరంగపరచకూడదు. ఈ విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment