
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ముందుగానే దొంగ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మదన్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు సుమిత్ అనే ఓ వ్యక్తితో తమపై కేసు పెట్టించుకొని ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సరిగ్గా లాలూకు శిక్షపడి ఆ జైలుకు తరలించే ముందే వారు జైలుకు వెళ్లి ఆయనకు సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, మదన్ యాదవ్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడం, దానిపై చర్చ జరుగుతుండటంతో అతడు జైలులో ఉన్నట్లు తెలిసింది.
దీంతో అతడు నివాసం ఉంటున్న ప్రాంతం వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే మదన్ యాదవ్ ఓ ధనవంతుడు. అతడికి రూ.10వేల దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇక లక్ష్మణ్ యాదవ్ అనే వ్యక్తి లాలూకు ఒకప్పుడు వంటమనిషిగా పనిచేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసుల దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టగా ఆ ఇద్దరు లాలూకు సన్నిహితులని, ఆయనకు సపర్యలు చేసేందుకు వారికి వారే దొంగ కేసులు పెట్టించుకొని జైలుకెళ్లారని గుర్తించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ 'సుమిత్ వచ్చి కేసు పెట్టినప్పుడు మాకు ఎలాంటి అనుమానం రాలేదు. పైగా వారు స్వయంగా కోర్టు మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. అనంతరం వారిని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు పంపించాం. అయితే, వారు లాలూ కోసమే ఫేక్ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లారని తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు.