సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. నిందితుడి అరెస్టులో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ అందోళనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ నేపథ్యంలో దాచేపల్లిలో గురువారం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ వెంకటప్పల నాయుడు పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడి ఆత్మహత్య
ఓ పక్క నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురజాల దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఘటనాస్థలికి బయలుదేరారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సుబ్యయ్యా? కాదా? అని పోలీసులు మరికాపేట్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
మా తప్పు ఒప్పుకుంటున్నాం: హోం మంత్రి
మరో వైపు దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తమ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి జరుగకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలని, మీడియా చైతన్య పర్చాలని చినరాజప్ప కోరారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment