
పెనమలూరు: కృష్ణానదిలో సోమవారం గల్లంతైన ఇద్దరు యువకులు మృత్యు వాత పడ్డారు. వారి మృతదేహాలను నది నుంచి మంగళవారం బయటకు తీసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. య నమలకుదురు సంజీవయ్యనగర్‌కు చెందిన చంద్రరత్నరాకేష్((16), జాన్‌బెన్నీ(16), విశ్వశాంతినగర్‌కు చెందిన దాసరి రాజ్‌కమల్ (16), విశ్వనాథపల్లి జీవన్‌బాబు (15) నాలుగు రోజుల క్రితం ప్రకటించిన ఫలితాల్లో పదవ తరగతి పాస్ అయ్యారు. వీరు సోమవారం గుణదల మేరీమాత చర్చికి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు.
అక్కడి నుంచి సరదాగా యనమలకుదురు శివలింగాల ఘాట్ వద్దకు వెళ్లి ఈత కొట్టడానికి నదిలో దిగారు. వీరు సరదాగా ఈత కొడుతూ వీడియో తీశారు. సెల్ఫీలు కూడా దిగారు. మరల నది వద్దకు వస్తామో లేదో అని అంటూ నదిలో జలకాలాడారు. ఇది కూడా సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. నదిలో నడుములోతు మాత్రమే నీరు ఉండటంతో ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయారు. చంద్రరత్నరాకేష్, జాన్ బెన్నీలు నదిలో ఉన్న ఊబిలో పడి గల్లంతయ్యారు. ఇది చూసిన మిగతా ఇద్దరు యువకులు భయంతో నది నుంచి ప్రాణాలతో బయటకు వచ్చారు. వీరి మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.
యనమలకుదురులో తీవ్ర విషాదం...
యనమలకుదురు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందటంతో విషాదం నెలకొంది. గ్రామానికి పక్కనే ఉన్న కృష్ణానదిలో తరచుగా ప్రమాదాలు జరిగి యువకులు మృత్యువాత పడుతుండటంతో గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఏడాది నదిలో ఈతకు దిగుతున్న యువకుల్లో కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. బెన్నీ తండ్రి జాన్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి శాంతి, సోదరి ఉన్నారు. రాకేష్‌కు తల్లి సంధ్య, సోదరుడు ఉన్నారు. ఇద్దరు యువకుల మృతి ఇరు కుటంబాల్లో తీరని విషాదం నింపింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.