
ప్రీతి (ఫైల్)
చెన్నై,టీ.నగర్: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీడామంగళం వెన్నాట్రంగరై లైన్ ప్రాంతానికి చెందిన సుమతి మన్నార్‌గుడి మునిసిపాలిటీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈ దంపతుల కుమార్తె ప్రితి (21) బీఈ చదివింది. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలైన ప్రీతికి తపాలాశాఖలో ఉద్యోగం లభించింది.
మన్నార్‌గుడి తామరైకుళం ప్రాంతంలోని తన తాత ఇంట్లో ఉంటూ 20 రోజులుగా ఎడకీళయూరు గ్రామంలోని తపాలా కార్యాలయంలో పనిచేస్తూ వచ్చారు. శనివారం తాత ఇంట్లో ఉంటున్న ప్రీతి హఠాత్తుగా ఒంటిపై కిరోసిన్ కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగువారు వచ్చి గాయపడిన ప్రీతిని మన్నార్‌గుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీనిగురించి మన్నార్‌గుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. తనకు సొంతమైన పూర్వీకుల ఆస్తిని విక్రయించేందుకు తల్లి సుమతి ప్రయత్నాలు చేసింది. ఇందుకు ప్రీతి వ్యతిరేకించింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య విబేధాలు తలెత్తాయి. అలాగే, నీడామంగళం ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రీతి ప్రేమించింది. ప్రీతి ఉద్యోగం చేస్తున్నా ఇంజినీరింగ్ విద్య విడనాడలేదు. కొన్ని రోజుల క్రితం పరీక్ష రాసేందుకు కోవైలోని కళాశాలకు వెళ్లగా అక్కడ రెండు రోజులు హోటల్‌లో బస చేసింది. ఇది ప్రేమికుడికి నచ్చలేదు. ప్రీతిని అతను అనుమానించాడు. దీంతో ప్రేమికుల మధ్య తగాదా ఏర్పడింది. వీటిలో ఏదేని కారణంతో ప్రీతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment