
మహేశ్ విక్రమ్ హెగ్డే (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : అసత్య కథనాలు రాసి మత విద్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో ఓ వెబ్ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. జైనమత గురువు ఉపాధ్యాయ మయాంక్ సాగర్ జీ మహారాజ్ హాసన్ జిల్లా శ్రావణబెలగొలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 19న వెళ్తున్నారు. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ముస్లిం యువకుడు జైన గురువును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జైన గురువుకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ క్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్‌కార్డ్ వెబ్‌సైట్ సహవ్యవస్థాపకుడు, నిర్వాహకుడు మహేశ్ విక్రమ్ హెగ్డే కథనాలు రాయడం స్థానికంగా కలకలం రేపింది. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఓ ముస్లిం యువకుడు జైనమత గురువుపై దాడికి పాల్పడ్డాడు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఏ మతానికి చెందిన వాళ్లకు రక్షణ లేదంటూ' ట్వీట్ చేశాడు విక్రమ్ హెగ్డే. ఆయన చేసిన ట్వీట్‌తో పాటు రాసిన వార్తా కథనాలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.
తమపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుకార్డు వెబ్‌సైట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మహేష్ విక్రమ్ హెగ్డే తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారని బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. విక్రమ్ హెగ్డేను అరెస్ట్ చేసిన మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు.
ఎడిటర్ అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం సిద్దరామయ్య ఆదేశాలతోనే విక్రమ్ హెగ్డేను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని బీజేపీ నేత ప్రతాప్ సింహా ఆరోపించారు. చట్టం తనపని తాను చేసుకు పోతుందని ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.