ఆదివారం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అంతిమయాత్రలో మృతదేహం వద్ద రోదిస్తున్న తమ్ముడు అజయ్, భార్య అమృత, తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన కూతురు షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కసితోనే మిర్యాలగూడకు చెందిన రియల్టర్ తిరునగరు మారుతీరావు భారీ స్కెచ్ వేసి ప్రణయ్‌ను తుదముట్టించాడని తెలుస్తోంది. ఈ హత్య వెనుక మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీ హస్తం ఉన్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు పూర్తిగా ఈ కేసు విచారణ సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరి గిన తర్వాత సాయంత్రానికల్లా ప్రధాన నిందితుడు మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ దాదాపు సేకరించామని అధికారులు చెబుతున్నారు.
ప్రణయ్, అమృతల వివాహం జరిగినప్పటి నుంచి వాళ్ల బంధాన్ని తెంచేందుకు మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవి ఫలించకపోవడంతో ప్రణయ్‌ను మట్టుబెట్టాలని ఆలోచించి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. దీని కోసం రూ.కోటి వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదని, ఇంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని హత్యలు చేసే గ్యాంగ్‌లు తక్కువగానే ఉంటాయని, ఇందులో మరో కోణం దాగి ఉందన్న అంచనాతో విచారణ చేపట్టిన్నట్లు చెబుతున్నారు. మారుతీరావు చెప్పిన వివరాల తరువాత ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు స్టేషన్లలో పెట్టి విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఎవరీ.. మహ్మద్ బారీ..
మారుతీరావు ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు హైదరాబాద్‌లో ఉంటూ నల్లగొండలో వ్యవహారాలు నడుపుతున్న మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మాజీ కానిస్టేబుల్ కొడుకైన బారీకి నేర చరిత్ర ఎక్కువగానే ఉందని పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో బారీ జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. నల్లగొండ పట్టణానికి చెందిన బారీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్‌ను ఈ హత్యలో వాడుకున్నాడని సమాచారం. 1998లోనే నల్లగొండ వన్‌టౌన్‌లో బారీపై రౌడీషీట్ తెరిచారు. బీజేపీ నేత గుండగోని మైసయ్య గౌడ్ హత్య కేసులో, మరో హత్య కేసులో, ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో బారీ నిందితుడు.అయిదారేళ్ల క్రితం ఓ భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు రావడం, అందులో మారుతీరావు జోక్యం చేసుకుని సయోధ్య కుదర్చడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రణయ్ హత్యకు రూ.కోటి డిమాండ్ చేసిన బారీకి పెద్ద మొత్తంలోనే అడ్వాన్సు ముట్టజెప్పాడని తెలిసింది. హత్య చేయడానికి వచ్చిన వారికి మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మారుతీరావు దగ్గరి మిత్రుడు కరీం సహకరించి షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం కరీంను, మారుతీరావుతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీం ద్వారానే బారీకి డబ్బులు పంపించినట్లు అనుమానిస్తున్నారు. బారీతోపాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.
తుది దశకు విచారణ: ఎస్పీ ఏవీ రంగనాథ్
ప్రణయ్ హత్య కేసులో విచారణ తుది దశకు వచ్చింది. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టం. కేసు పూర్వాపరాలను ఒకటీ రెండు రోజుల్లో బయటపెడతాం. విచారణ దశలో ఉన్న కేసులో ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేం. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు వారిని నమ్మించి దెబ్బకొట్టాడు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఇందులో నయీం గ్యాంగ్ హస్తం ఉందన్నది వాస్తవం కాదు. నయీమే లేడు ఇక గ్యాంగ్ ఎక్కడిది. ఇది పక్కా పరువు హత్య. సుపారీ గ్యాంగ్‌తో చేయించిన పని. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతాం.
ఇంటి వద్దనే హత్య చేయడానికి రెక్కీ..
ప్రణయ్‌ని ఇంటి వద్దనే హత్య చేయడానికి నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22న ఒకసారి ప్రణయ్ కారు వెనుకాల వచ్చి రెక్కీ నిర్వహించాడు. కారు అద్దెకు కావాలని ప్రణయ్ తండ్రి బాలస్వామిని అడిగిన నిందితుడు ఆ సమయంలో ప్రణయ్ ఉంటే హత్య చేయాలని వచ్చినట్లు సమాచారం. అలాగే మరోసారి ఇంటి ముందు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అయితే తనకు ప్రాణహాని ఉందని తెలిసిన ప్రణయ్ ఎప్పుడూ కారులో కూర్చున్న తరువాతే బయటికి వచ్చేవాడని, ఇలా ఇంటి వద్ద హత్య చేయడానికి అవకాశం రాకపోవడంతోనే ఆస్పత్రిని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేత కరీం. (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment