మృతి చెందిన లా విద్యార్థి దిలీప్(ఫైల్ ఫొటో), ఇన్‌సెట్లో విజయ్ శంకర్
సాక్షి, అలహాబాద్: కేవలం కాలు తగలడంతో మొదలైన ఓ గొడవలో లా (న్యాయశాస్త్రం) విద్యార్థి దిలీప్ సరోజ్ హత్యకు గురికావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. కొన్ని విషయాలు వెలుగుచూశాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్‌కు రాజకీయ సంబంధాలున్నాయని, సుల్తాన్‌పూర్‌కు చెందిన ఓ కీలక నేత అండదండలున్నాయని పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం... గత శుక్రవారం అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌కు దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రధాన నిందితుడు విజయ్ శంకర్‌కు దిలీప్ కాలు తగలడంతో వివాదం మొదలైంది. కొంత సమయానికే హాకీ స్టిక్స్‌తో, ఐరన్ రాడ్‌తో దిలీప్‌పై విజయ్ శంకర్, రెస్టారెంటె వెయిటర్ మున్నా చౌహాన్ దాడి చేశారు. కుప్పకూలిపోయిన దిలీప్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మృతిచెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వెయిటర్ మున్నాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనను కొట్టినందుకే దిలీప్‌పై దాడి చేశానని వెయిటర్ చెబుతున్నాడు.
దిలీప్ మృతి అనంతరం రైల్వే ఉద్యోగి, ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతడికి సుల్తాన్‌పూర్ జిల్లాకు చెందిన కీలకనేత చంద్ర భద్రా సింగ్ అలియాస్ సోనూ సింగ్‌కు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. సుల్తాన్‌పూర్‌కే చెందిన నిందితుడు విజయ్ సోనూ సింగ్ వద్ద తలదాచుకున్నడాని భావిస్తున్న పోలీసులు ఓ బృందాన్ని అక్కడికి పంపించారు. సోనూ సింగ్‌కు, విజయ్‌కి సంబంధం ఉన్నట్లు తమ వద్ద ఎన్నో సాక్ష్యాలు, ఫొటోలున్నాయని పోలీసులు చెబుతున్నారు. లా విద్యార్థి దిలీప్ హత్య కేసులో నిందితుడి కుటుంబసభ్యులతో పాటు అవసరమైతే సోనూ సింగ్‌ను విచారిస్తామని సీనియర్ పోలీస్ అధికారి అకాశ్ కుల్హారీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment