పాలకొండ ఏరియా ఆస్పత్రిలో సీతంనాయుడు మృతదేహం
ఆస్తి వివాదం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తండ్రీ కొడుకుల మధ్య వివాదం చిలికి చిలికి చివరకు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. క్షణికావేశంలో కొడుకును హతమార్చిన తండ్రి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కన్న కొడుకును తానే కడతేర్చాననే బాధను భరించలేక కృంగిపోయి చివరకు సబ్‌జైల్‌లోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమయింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.
పాలకొండ రూరల్/పాలకొండ: రాజాం పట్టణంలో నవ్యనగర్ కాలనీకి చెందిన కలిపిండి సీతంనాయుడు హత్యకు పాల్పడ్డాడు. ఆస్తివివాదం కారణంగా గత నెల 28వ తేదీన తన స్వగృహంలో నిద్రిస్తున్న కన్న కుమారుడు శ్రీకాంత్ నాయుడును కత్తితో నరికాడు. ఈ ఘటనలో శ్రీకాంత్‌నాయుడు మరణించాడు. దీంతో నిందితుడు సీతంనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని రాజాం కోర్టులో హాజరుపర్చగా ఆయనకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో భాగంగా ఈ నెల 1వ తేదీన సీతంనాయుడును పాలకొండ సబ్‌జైల్‌కు తరలించారు.
ఈ క్రమంలో సబ్‌జైల్లో ఉన్న సీతంనాయుడు ఆ రోజు నుంచి మనోవేదనతో ఉన్నట్టు జైలు సిబ్బంది చెబుతున్నారు. సక్రమంగా భోజనం చేయకపోవటంతో పాటు చనిపోయిన కుమారుడిని తలచుకొని మథనపడుతుండేవాడని తోటి ముద్దాయిలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీతంనాయుడు ఆరోగ్యం దెబ్బతిని శ్వాస సంబంధిత వ్యాధికి గురయ్యాడు. దీంతో ఈ నెల 4వ తేదీ గురువారం జైలు సూపరింటెండెంట్ వి.వెంకటరమణ తన సిబ్బందితో కలిసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. అక్కడ కూడా సీతంనాయుడు తన అనారోగ్యానికి కారణం నేరం చేశానన్న మనోవేదనేనని చెప్పినట్టు వైద్యులు అంటున్నారు. అయితే ఇదే రోజు రాత్రి సబ్‌జైలులో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో మళ్లీ అర్ధరాత్రి స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మృతిపై అనుమానాలు
ఇదిలా ఉంటే సీతంనాయుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన గుండెపోటుతో చనిపోయారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న అనుమాలు శుక్రవారం అంతా చక్కర్లుకొట్టాయి. పోస్టుమార్టం నివేదిక అందితే తప్ప పూర్తిస్థాయి వాస్తవాలు చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.
సాయంత్రానికి చేరుకున్న భార్య
సీతంనాయుడు మృతదేహం ఆస్పత్రి మార్చురీలో ఒంటరిగా మిగిలింది. చనిపోయిన విషయాన్ని కుటుం బసభ్యులకు తెలియజేసినప్పటికీ వారెవరు సాయంత్రం వరకు మృతదేహం వద్దకు వచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో అటు పోలీసులు, ఇటు జైలు సిబ్బంది తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం మృతుని భార్య సరోజిని రావటంతో పాలకొండ న్యాయస్థానం ఇన్‌చార్జి న్యాయమూర్తి కిరణ్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి.స్వరూపారాణి, ఆర్డీవో రెడ్డి గున్నయ్య, సీఐ సూరినాయుడు సమక్షంలో శవపంచనామా పూర్తిచేసి పోస్టుమార్టం ప్రారంభించారు. మృతదేహాన్ని సీతంనాయుడు కుటుంబీకులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలు
శ్రీకాకుళం సిటీ: పాలకొండ సబ్ జైలులో రిమాండ్‌ఖైదీ కలిపిండి సీతంనాయుడు మృతి ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా సబ్‌జైళ్లల సూపరింటెండెంట్(పర్యవేక్షణాధికారి) బి.వీరన్న తెలిపా రు. నివేదిక ఆధారంగానే బాధ్యులపై శాఖాపరమై న చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment