‘సారు నీ కాళ్లు మొక్కుతా.. పైసాపైసా పోగుచేసుకుని మీ మీద నమ్మకంతో జమచేసిన. రెండెళ్లయింది ఇస్తామని.. ఇంకా ఇస్తలేరు. చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. మా బాధను అర్థం చేసుకోండి.. మా డబ్బులు మాకు ఇయ్యుండ్రి’.. అంటూ జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో నిత్యం బాధితుల మొరలు వినిపిస్తున్నాయి.
సాక్షి, కామారెడ్డి టౌన్/కామారెడ్డి: వందలాది మంది బాధితులు తాము జమ చేసుకున్న డబ్బుల కోసం కంపెనీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సిన సమయం ఏడాది దాటి నా, ఖాతాదారులు కాళ్లవేళ్లా పడినా డబ్బులు ఇవ్వడం లేరు. కంపెనీ పేరు తో మరో చోట పెట్టుబడులు పెట్టామని, డబ్బులు వచ్చాకే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ డబ్బులు ఇస్తారా.. ముంచేస్తారా.. అన్న సందేహంలో ఖాతాదారులు అందోళనకు గురవుతున్నారు.
బారులు తీరుతున్న బాధితులు
చిట్టీల పేరుతో వందలాది మంది ఖాతాదారుల నుంచి ఐదేళ్లలో రూ.కోట్ల డబ్బులు కట్టించుకున్న వెల్ఫేర్ కంపెనీ చెల్లింపుల్లో పాల్పడుతున్న మోసాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులు తమ డబ్బుల కోసం బారు లు తీరడం పెరిగింది. సిబ్బంది మా త్రం తమ దగ్గర డబ్బులు లేవంటున్నా రు. ‘అవసరమైతే తాళం వేసి బయట పంచాయితీ పెట్టుకుందాం.. అప్పుడు మీ డబ్బులు పూర్తిగా రావు మీ ఇష్టం’.. అనే రీతిలో సమాధానాలిస్తున్నారు. మేం ఇచ్చిన్నప్పుడే తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇస్తున్నారని ఖాతాధారులు వాపోతున్నారు. రాసిచ్చిన తేదీల్లోనే రావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం పేరిట నట్టేట ముంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు.
పేదలనే టార్గెట్ చేశారు
కూలీలు, బీడీ కార్మికులు, చిరుద్యోగులనే కంపెనీ టార్గెట్‌గా చేసుకుంది. భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చి 50కిపైగా ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ ద్వారా 40కి పైగానే కస్టమర్లను రాబట్టారు. మా కంపెనీలో ప్రతి నెల చొప్పున మూడేళ్లు డబ్బులు పోగుచేసి మరో రెండేళ్లు ఆగితే కస్టమర్లకు రెండింతలు ఇస్తామని ఆశ చూపించారు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కట్టించుకున్నారు. ఇలా రూ.2.50 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బుతో కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 మందికిపైగా ఖాతాదారులు కంపెనీకి బాధితులుగా ఉన్నట్లు తెలిసింది.
దీంట్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. కంపెనీ కార్యాలయానికి బాధితులు వస్తుండడంతో వెల్ఫేర్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై కామారెడ్డి బ్రాంచ్ ఏరియా మేనేజర్ లక్ష్మీనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇక్కడి ఇబ్బందులను, ఖాతాదారుల కష్టాలను కంపెనీ ఎండీకి తెలిపామని, పైనుంచి డబ్బులు వస్తేనే చెల్లిస్తామని, మా చేతుల్లో ఏమి లేదని సమాధానమిచ్చారు.
చెప్పులరిగేలా తిరుగుతున్నా..
మా ఊరి ఏజెంట్ నమ్మించి మూడేళ్లు డబ్బులు కట్టించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇయ్యలే. ఆర్నెళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా. కాళ్లు మొక్కుతా అన్నా కనికరిస్తలేరు. మాలాంటి పేదోళ్లను మోసం చేస్తున్నారు. మా డబ్బులు మాకు వెంటనే ఇయ్యాలే.
– బాలవ్వ, రామారెడ్డి మండలం
Comments
Please login to add a commentAdd a comment