
దాడిలో గాయపడ్డ కుక్కపిల్ల
పుణె : వీధి కుక్కల సంరక్షణకు పుణె మున్సిపల్ కార్పోరేషన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదు. పుణె నగరంలో రోజురోజుకు వీధి కుక్కలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒక నెల కాలంలో దాదాపు 20 కుక్కలకు విషమిచ్చి చంపారు కొందరు. కుక్క పిల్లలన్న జాలి కూడా లేకుండా దాడులకు తెగబడుతున్నారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కుక్క పిల్లను ఇనుప రాడ్‌తో దవడ విరిగేలా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పుణెలోని బావ్ పాటిల్ రోడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బావ్ పాటిల్ రోడ్‌లోని గణపతి దేవాలయం సమీపంలో జూలై 4న సలీమ్ షేక్ అనే కూరగాయల వ్యాపారస్తుడు రెండు నెలల కుక్క పిల్లపై దాడికి తెగబడ్డాడు. ఓ వ్యక్తి కుక్క పిల్లను విచక్షణా రహితంగా కొడుతున్నాడన్న సమాచారం అందుకున్న జంతు హక్కుల కార్యకర్త నికితా కదమ్ అక్కడకు చేరుకుంది.
కుక్క పిల్లపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడ్డ కుక్క పిల్లను ఆస్పత్రికి తరలించగా దవడ భాగం విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఇటుకతో 8నెలల కుక్క పిల్లపై ఓ వ్యక్తి దాడి చేయగా కంటిని కోల్పోయింది. వీధి కుక్కలపై దాడులు పెరిగిపోతుండటంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.