ఎల్‌బీ నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన షైన్ ఆస్పత్రి భవనం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో.. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీలు చేపట్టి.. ఆస్పత్రి సెల్లార్‌తో సహా నాలుగు అంతస్థులని క్షుణ్ణంగా పరిశీలించారు. షైన్ హాస్పిటల్‌లో జరిగిన ప్రమాదంపై విచారణను వేగవంతం చేసేందుకు ఇప్పటికే క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం అధికారులు ఇప్పటికే హాస్పిటల్‌కు నోటీసులు జారీ చేశారు. షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రమాదంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చనుంది. అనంతరం ప్రభుత్వానికి తన రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. జంటనగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రమాద ఘటన తరువాత గతేడాదితో ఆస్పత్రి పర్మిషన్ ముగిసిందని, ఆస్పత్రిలో ప్రమాదం జరిగినపుడు తక్షణమే పాటించాల్సిన నియంత్రణ వ్యవస్థే లేదని మానవ హక్కుల కమిషన్‌కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. భవనం అక్రమ కట్టడమని, అధికారుల నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఒక చిన్నారి మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలనివారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment